Budget 2026 : అమ్మో..మన మొదటి బడ్జెట్ ఇంత తక్కువా..బ్రిటీష్ వారు వెళ్తూ వెళ్తూ మనకు ఇంత పెద్ద టోపీ పెట్టారా ?

Budget 2026 : అమ్మో..మన మొదటి బడ్జెట్ ఇంత తక్కువా..బ్రిటీష్ వారు వెళ్తూ వెళ్తూ మనకు ఇంత పెద్ద టోపీ పెట్టారా ?
X

Budget 2026 : నేడు మనం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ గురించి, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. దేశ విభజన గాయాలు, మత ఘర్షణలు, శరణార్థుల సమస్యల మధ్య మన తొలి ఆర్థిక మంత్రి ఆర్‌.కె.షణ్ముఖం శెట్టి దేశపు మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1947 నవంబర్ 26న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్ కేవలం 7న్నర నెలల కాలానికి (ఆగస్టు 15 నుంచి మార్చి 31 వరకు) మాత్రమే ఉద్దేశించింది. ఆనాటి అంకెలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

నేడు ఒక చిన్న ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కంటే ఆనాటి దేశ మొత్తం ఆదాయం తక్కువగా ఉండటం గమనార్హం. స్వతంత్ర భారత తొలి బడ్జెట్ మొత్తం ఆదాయం కేవలం రూ. 171.15 కోట్లు మాత్రమే. ఇక ప్రభుత్వ మొత్తం ఖర్చు రూ.197.29 కోట్లుగా అంచనా వేశారు. అంటే మన దేశం మొదటి నుండే లోటు బడ్జెట్‌తోనే (రూ.24.59 కోట్ల లోటు) ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బ్రిటీష్ వాళ్లు దేశ సంపదనంతా దోచుకెళ్లగా, మనకు మిగిలింది కేవలం అప్పులు, సవాళ్లు మాత్రమే.

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ రక్షణే అతిపెద్ద సవాలుగా ఉండేది. అందుకే ఆనాటి బడ్జెట్‌లో సింహభాగం అంటే దాదాపు 47 శాతం నిధులు (రూ.92.74 కోట్లు) రక్షణ రంగానికే కేటాయించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 1947లో దేశం విడిపోయినా, 1948 సెప్టెంబర్ వరకు భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు ఒకే కరెన్సీని పంచుకున్నాయి. ఆ తర్వాతే పాకిస్థాన్ తన సొంత కరెన్సీని ముద్రించుకుంది. అప్పట్లో సంస్థానాల విలీనం జరగకపోవడంతో, ఆ తర్వాత వచ్చిన జాన్ మథాయ్ గారు 1949-50లో పూర్తిస్థాయి ఉమ్మడి భారత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

భారత రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్ ప్రకారం దీనిని వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తారు. అయితే మన దేశంలో బడ్జెట్ అనే పదం బ్రిటీష్ వారి కాలం నుండే ఉంది. భారత్‌లో మొట్టమొదటి బడ్జెట్‌ను ఏప్రిల్ 7, 1860న జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. నాటి 171 కోట్ల బడ్జెట్ నుంచి నేటి లక్షల కోట్ల బడ్జెట్ వరకు మనం సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. దేశం ఎంతటి సంక్షోభంలో ఉన్నా, ఆర్థిక మంత్రులు నాడు చూపిన ధైర్యం వల్లే ఈనాడు మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచాం.

Tags

Next Story