India GDP : జీఎస్టీ, వినియోగం జోరు.. భారత జీడీపీకి రెక్కలు.. 8.8% వృద్ధి అంచనా.

India GDP : జీఎస్టీ, వినియోగం జోరు.. భారత జీడీపీకి రెక్కలు.. 8.8% వృద్ధి అంచనా.
X

India GDP : భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం అంచనాలకు మించి వేగంగా పుంజుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు, సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) 6.5% నుంచి 6.8% వరకు పెరుగుతుందని చాలా మంది అంచనా వేస్తుండగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) సంస్థ మరింత సానుకూల అంచనాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం ఈ ఏడాది భారత జీడీపీ 7.4% వరకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పరిస్థితులు బాగా కలిసివస్తే ఈ వృద్ధి రేటు 8.8% వరకు కూడా పెరగవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) ఆశాభావం వ్యక్తం చేసింది.

గతంలో NIPFP భారత జీడీపీ 6.6% మాత్రమే పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఆ అంచనాను పెంచడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వస్తువులు, సేవల పన్ను (GST) వ్యవస్థలో వచ్చిన సంస్కరణలు, మెరుగుదల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడం ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వస్తువులను, సేవలను కొనుగోలు చేయడం పెరగడం వల్ల దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుగా మారింది.

అమెరికా వంటి మన దేశాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పరిస్థితి సానుకూలంగా ఉండటం కూడా భారత్‌కు కలిసొచ్చే అంశంగా NIPFP పేర్కొంది. భారత వృద్ధి రేటు 8.8% దాటడానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందనేది కీలకం అని NIPFP అభిప్రాయపడింది. ఇందుకు రెండు పరిస్థితులను అంచనా వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన దానికంటే 1% అధికంగా వృద్ధి చెందితే, దాని సానుకూల ప్రభావంతో భారతదేశ జీడీపీ ఈ ఏడాది 8.8% వరకు పెరిగే అవకాశం ఉంది.

ఒకవేళ అమెరికా జీడీపీ అంచనాల కంటే 1% తక్కువగా పడిపోతే, భారత వృద్ధి కేవలం 6%కే పరిమితం కావొచ్చు అని NIPFP హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన NIPFP, ద్రవ్యోల్బణం విషయంలో కూడా సానుకూల అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.6% మాత్రమే ఉండవచ్చు అని NIPFP అంచనా వేసింది.

ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 2.6% కంటే చాలా తక్కువ. అక్టోబర్ నెలలో భారత ద్రవ్యోల్బణం 0.25%కి పడిపోవడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంత తక్కువ స్థాయికి ధరల పెరుగుదల తగ్గడం ఇదే మొదటిసారి. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

Tags

Next Story