Seaplane Service : పర్యాటక రంగంలో గేమ్ ఛేంజర్.. సీ-ప్లేన్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్.

Seaplane Service : పర్యాటక రంగంలో గేమ్ ఛేంజర్.. సీ-ప్లేన్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్.
X

Seaplane Service : భారతదేశ విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేవనుంది. నీటిపై తేలుతూ, గాలిలో ఎగిరే సీ-ప్లేన్ సర్వీసులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి మన దేశంలో సీ-ప్లేన్ ప్రయాణం 2010లోనే ముంబైలోని జుహూ ఎయిర్‌డ్రోమ్ నుంచి మొదలైంది. అప్పట్లో అండమాన్ నికోబార్ దీవుల్లో జల హంస పేరుతో సేవలు ప్రారంభించినా, నిర్వహణ ఖర్చులు భరించలేక, సరైన వసతులు లేక ఈ ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కొచ్చిలో ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన ప్రయత్నం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈసారి ఈ రంగంపై గట్టి నమ్మకంతో ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీ-ప్లేన్ సేవల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రకటించారు. అంటే లాభాలు తక్కువగా ఉండే మార్గాల్లో విమానాలు నడిపే కంపెనీలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తుంది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా పథకం కింద మన దేశంలోనే ఈ విమానాల తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణ ఛార్జీలు తగ్గి, సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం లక్షద్వీప్ పర్యాటకానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా స్కైహాప్ ఏవియేషన్ అనే కంపెనీ రంగంలోకి దిగింది. కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని అగట్టి, కవరట్టి, కల్పేని, కిలన్, కద్మత్ వంటి ఐదు ప్రధాన దీవులకు 19 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలను నడపనుంది. దీనివల్ల గంటల తరబడి ఫెర్రీలు (పడవలు), షిప్పుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. నిమిషాల్లోనే పర్యాటకులు ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకోవచ్చు. రాబోయే ఐదేళ్లలో భారత్ సీ-ప్లేన్ సేవలలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. వందలాది నదులు, చెరువులు, డ్యామ్‌లు ఉన్నాయి. వీటిని రన్‌వేలుగా వాడుకుని విమానాలను ల్యాండ్ చేయవచ్చు. సీ-ప్లేన్ల వల్ల కేవలం పర్యాటకమే కాకుండా, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో రోగులను తరలించడానికి, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే శిక్షణ పొందిన పైలట్ల కొరత, భద్రతా ప్రమాణాలను పెంచడం వంటి సవాళ్లను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Tags

Next Story