Sugar Output : భారతదేశంలో గణనీయంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి.. ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్.

Sugar Output : ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి అనుకూಲమైన వాతావరణం, మంచి వర్షపాతం, అధిక దిగుబడి అంచనాల కారణంగా మొత్తం చక్కెర ఉత్పత్తి 16 శాతం పెరిగి 343.5 లక్షల టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గత 2024-25 సంవత్సరంలో 296.1 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో అధిక పెరుగుదల ఉంటుందని ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ఈ అంచనాలతో దేశీయ చక్కెర పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది.
ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈ వారం తమ మొదటి ముందస్తు అంచనా నివేదికను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ చక్కెర ఉత్పత్తి గత సంవత్సరం (296.1 లక్షల టన్నులు) కంటే 16 శాతం పెరిగి 343.5 లక్షల టన్నులకు చేరవచ్చని ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. అనుకూలంగా విస్తరించిన రుతుపవన వర్షాలు, జలాశయాలలో మంచి నీటి నిల్వ, మెరుగైన చెరకు అభివృద్ధి పథకాలు వంటి అంశాలు ఈసారి దిగుబడి పెరగడానికి ప్రధాన కారణాలుగా ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది.
చెరకు సాగు విస్తీర్ణం పెరగడం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు చక్కెర పరిశ్రమకు బలాన్నిస్తున్నాయి. చెరకు సాగు ఇప్పుడు మరింత లాభదాయకంగా మారడాన్ని ఇది సూచిస్తుంది. గత సంవత్సరం (2024-25) 57.11 లక్షల హెక్ಟార్లలో చెరకు సాగు చేయగా, ఈ సంవత్సరం ఇది 57.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. చక్కెర ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం 15 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇచ్చింది. అలాగే మొలాసిస్ పై ఉన్న 50 శాతం సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. ఈ చర్యలన్నీ చక్కెర పరిశ్రమకు ఊతమిచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత అత్యధిక చక్కెర ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. దేశీయంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. చక్కెర ఉత్పత్తిలో అత్యధిక పెరుగుదల మహారాష్ట్ర నుంచే నమోదయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం 93.51 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగా, ఈ సంవత్సరం ఇది 130 లక్షల టన్నులకు పెరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 14 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 22.57 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈసారి 103.2 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కావచ్చని అంచనా. కర్ణాటక రాష్ట్రంలో 6.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. గత సంవత్సరం 54.89 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగా, ఈసారి ఉత్పత్తి 63.5 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

