IndiGo Pilot Salaries : ఇండిగో పైలట్‌లకు నెలకి ఎంత జీతం వస్తుంది? ఫస్ట్ ఆఫీసర్ నుంచి కెప్టెన్ వరకు పూర్తి వివరాలివే.

IndiGo Pilot Salaries : ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అయిన ఇండిగో తీవ్ర సంక్షోభంలో ఉంది. డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దవడం లేదా ఆలస్యంగా నడవడంతో ఇండిగో సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఇబ్బందులకు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి, రద్దయిన విమానాలకు పూర్తి డబ్బు వాపస్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ సంక్షోభానికి కారణం క్రూ మెంబర్స్, పైలట్‌ల అసంతృప్తి అని తెలుస్తోంది. దేశీయ ఎయిర్‌లైన్ రంగంలో దాదాపు 60% వాటాను కలిగి ఉన్న ఈ కంపెనీలో పైలట్‌లకు ఎంత జీతం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
పైలట్‌ల జీతాలు (2025 అంచనా)
దేశీయ విమానయాన పరిశ్రమలో అత్యంత పోటీతత్వంతో కూడిన, లాభదాయకమైన ఉద్యోగాలను అందించే సంస్థల్లో ఇండిగో ఒకటి. 2025 నాటికి అనుభవం లేని (ఎంట్రీ-లెవల్) పైలట్‌ల నుంచి అనుభవజ్ఞులైన కెప్టెన్‌ల వరకు ఇండిగో అద్భుతమైన వేతన ప్యాకేజీలను అందిస్తోంది. జీతం అనేది అనుభవం, మొత్తం విమాన గంటలు, ర్యాంక్, ట్రైనింగ్ వంటి అదనపు బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ పోస్టులకు జీతాలు వేర్వేరుగా ఉంటాయి:
ఫస్ట్ ఆఫీసర్ జీతం: విమానంలో కెప్టెన్‌తో పాటు పనిచేసే సెకండ్ పైలట్‌ను ఫస్ట్ ఆఫీసర్ అంటారు. వీరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడటం, కాక్‌పిట్‌లో ఇతర బాధ్యతలను నిర్వహించడం వంటివి చూస్తారు. 2025 నాటికి ఫస్ట్ ఆఫీసర్ జీతం నెలకు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. అంటే, ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తారు.
కెప్టెన్ జీతం: కెప్టెన్లకు 2025లో నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జీతం లభించే అవకాశం ఉంది. అంటే, వీరి వార్షిక ఆదాయం రూ.60 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. (ఇది దాదాపు $70,000 నుంచి $140,000 కి సమానం).
ఇండిగో పైలట్‌లకు అదనపు ప్రయోజనాలు
ఇండిగోలో పైలట్‌గా ఉండటం అంటే మంచి జీతం మాత్రమే కాదు, స్థిరమైన, మంచి కెరీర్ కూడా లభిస్తుంది. 2025లో ఇండిగో పైలట్‌లకు సమగ్రమైన ప్యాకేజీని అందిస్తోంది.
పర్ఫామెన్స్ బోనస్ : అదనపు విమాన గంటలు, మెరుగైన పనితీరు, శిక్షణలో సహకారం వంటి బాధ్యతలకు ఇండిగో బోనస్‌లు అందిస్తుంది. కంపెనీ లాభాల్లో వాటాను కూడా ఇస్తుంది.
కుటుంబానికి ప్రోత్సాహం: పైలట్‌ల భార్య/భర్త, పిల్లలకు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్‌లలో ప్రాధాన్యత ఇస్తుంది. కోర్సు పూర్తి అయిన తర్వాత ఉద్యోగ నియామకంలో కూడా సహాయం చేస్తుంది.
ఉచిత ప్రయాణం : పైలట్‌లు, వారి కుటుంబ సభ్యులకు ఇండిగో విమానాలలో అన్ లిమిటెడ్ ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది.
శిక్షణ, నాయకత్వ వృద్ధి: ఇండిగో పైలట్‌లకు సిమ్యులేటర్ శిక్షణ, రిఫ్రెషర్ కోర్సులు, మేనేజర్ లెవల్ పోజిషన్ కోసం ట్రైనింగ్ కూడా అందిస్తుంది.
ఆరోగ్యం, శ్రేయస్సు: పూర్తి ఆరోగ్య బీమా, వార్షిక వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సహాయం, పోషకాహార సెషన్లతో సహా సమగ్రమైన ఆరోగ్య ప్యాకేజీని అందిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

