IndiGo : విమానయాన రంగంలో సునామీ.. 1000 మందికి ఉద్యోగాలిస్తున్న ఇండిగో.

IndiGo : దేశీయ విమానయాన రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ గత కొంతకాలంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పైలట్ల కొరత, విమానాల రద్దు, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహానికి గురైన ఇండిగో, ఇప్పుడు మళ్లీ తన బాద్‌షా ఇమేజ్‌ను కాపాడుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. విమాన ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఏకంగా వెయ్యి మంది పైలట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ నెలలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఊహించని సంక్షోభంలో కూరుకుపోయింది. కేవలం వారం రోజుల్లోనే 5,000 పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. పైలట్ల పనివేళలపై డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఒక్కసారిగా సిబ్బంది కొరత ఏర్పడింది. విమానాలు ఉన్నా, నడిపే వారు లేక ఇండిగో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దీంతో పాటు భారీ జరిమానాలు, నియంత్రణ సంస్థల విచారణలతో కంపెనీ పరువు మసకబారింది. ఈ వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇండిగో, ఇప్పుడు భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది.
ఎవరెవరిని తీసుకుంటున్నారు?
ఇండిగో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సుమారు 1,000 మంది పైలట్లను నియమించుకోనున్నారు. ఇందులో ట్రైనీ ఫస్ట్ ఆఫీసర్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, కెప్టెన్లు ఉన్నారు. విశేషమేమిటంటే సాధారణంగా ఇండిగో వాడే ఎయిర్‌బస్ ఏ320 విమానాలను నడిపిన అనుభవం లేని పైలట్లను కూడా ఈసారి తీసుకునేందుకు సంస్థ సిద్ధమైంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు. నెలకు సగటున 4 కొత్త విమానాలను తమ నౌకాదళంలో చేర్చుకుంటున్న ఇండిగో, భవిష్యత్తులో ప్రయాణీకులకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్‌లో అసలేం జరిగింది?
డీజీసీఏ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త విశ్రాంతి నిబంధనలకు అనుగుణంగా ఇండిగో ముందే సిబ్బందిని నియమించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తేలింది. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య ల్యాండింగ్‌ల సంఖ్యపై పరిమితులు, వారాంతపు సెలవుల పెంపు వంటి నిబంధనల వల్ల పైలట్లపై పనిభారం పెరిగింది. డిసెంబర్‌లో సంస్థకు 2,422 మంది కెప్టెన్లు అవసరం కాగా, కేవలం 2,357 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారాయి.
సర్వీసుల పునర్వ్యవస్థీకరణ
ప్రస్తుతం ఇండిగో తన నెట్‌వర్క్‌ను పూర్తిగా మారుస్తోంది. విమానాల మధ్య విరామ సమయాన్ని పెంచింది. ఫిబ్రవరి నాటికి ఈ విరామ సమయం 3 శాతానికి పెరిగింది. అలాగే అత్యవసర సమయాల్లో వాడేందుకు స్టాండ్‌బై క్రూను కనీసం 15 శాతానికి పెంచారు. ప్రతి విమానానికి ముగ్గురు పైలట్ల బృందాలు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఇండిగో తమ విమానాలను ఎక్కువగా వాడుతుంది కాబట్టి, ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. నిరుద్యోగ పైలట్లకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
