Insurance : దేశంలో 95 శాతం మందికి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు..ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక.

Insurance : భారతదేశంలో బీమా అవసరం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ నివేదిక ప్రకారం దేశంలో కేవలం 5 శాతం మందికి మాత్రమే జీవిత బీమా ఉంది. అంటే దాదాపు 95 శాతం జనాభాకు ఎటువంటి బీమా భద్రత లేదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, అది కూడా కేవలం 37 శాతానికే పరిమితమైంది. బీమా తీసుకోవాలనే కోరిక ఉన్నా, తమ ఆదాయానికి మించిన ప్రీమియంలు ఉండటంతో సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు.
బీమా ఉత్పత్తులను సామాన్యులకు చేరవేయాలంటే వాటిని సులభతరం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఎడ్మే ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ ఎండీ నోచికేతా దీక్షిత్ అభిప్రాయం ప్రకారం.. తక్కువ ప్రీమియం, సరళమైన నిబంధనలతో కూడిన పాలసీలు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తాయి. పాలసీ రూల్స్ స్పష్టంగా ఉంటేనే ప్రజల్లో బీమా కంపెనీలపై నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే భవిష్యత్తులో వారు మరిన్ని ఎక్కువ కవరేజీలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రతినిధి చేతన్ వాసుదేవ ప్రకారం.. అవసరానికి మించిన ఫీచర్లు, యాడ్-ఆన్‌లు, పేజీల కొద్దీ ఉండే కండీషన్లు పాలసీని మరింత ఖరీదైనదిగా, గందరగోళంగా మారుస్తున్నాయి. నేటి కస్టమర్ తాను చెల్లించే రూపాయికి ఎలాంటి రిస్క్ కవరేజీ లభిస్తుందో స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే, పరిమితమైనా కానీ అత్యవసరమైన కవరేజీని ఇచ్చే సింపుల్ ప్లాన్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బీమా కొనడం చాలా సులభమైపోయింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల వివిధ కంపెనీల పాలసీలను పోల్చి చూడటం, నిబంధనలను నిశితంగా పరిశీలించడం సాధ్యమవుతోంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, ఏజెంట్ల కమీషన్లు తగ్గి పాలసీ ధరలు కూడా తగ్గుతున్నాయి. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా వేగవంతమైంది.
చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. టెక్నాలజీ సాయంతో అండర్ రైటింగ్ మరియు క్లెయిమ్ ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించవచ్చు. తక్కువ నిబంధనలు, స్పష్టమైన కవరేజీ, మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్రీమియం.. ఇవే బీమాను ప్రతి ఇంటికి చేరవేసే మార్గాలని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
