Stock Market : స్టాక్ మార్కెట్లకు యుద్ధ సెగ.. 15 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.39 లక్షల కోట్లు ఆవిరి.

Stock Market : స్టాక్ మార్కెట్లకు యుద్ధ సెగ.. 15 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.39 లక్షల కోట్లు ఆవిరి.
X

Stock Market : మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఫిబ్రవరి 28న దాడులు జరిగినప్పటికీ, ఆ సెగ మాత్రం ఫిబ్రవరి 27 నుంచే స్టాక్ మార్కెట్లకు తాకింది. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లపై ఈ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. కేవలం గత 15 రోజుల్లోనే భారతీయ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.39 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇది సామాన్య ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.

అమెరికా మార్కెట్లతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అమెరికాలోని నాస్‌డాక్, డౌ జోన్స్ వంటి సూచీలు 3 నుంచి 6 శాతం పడిపోగా, మన దేశంలోని సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 9 శాతం పైగా కుంగాయి. యుద్ధం వల్ల ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటడం భారత్‌కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే మన దేశ అవసరాల్లో 88 శాతం చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. దీనికి తోడు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు ఒకే నెలలో రూ.52 వేల కోట్లు వెనక్కి తీసుకోవడం మార్కెట్లను మరింత పాతాళానికి నెట్టాయి.

అమెరికా మార్కెట్ల పరిస్థితి చూస్తే.. ఫిబ్రవరి 26న 22,878 పాయింట్ల వద్ద ఉన్న నాస్‌డాక్ కాంపోజిట్, మార్చి 13 నాటికి 22,105 పాయింట్ల వద్ద ముగిసింది (3.38% తగ్గుదల). అలాగే డౌ జోన్స్ అత్యధికంగా 5.94 శాతం నష్టపోయి 46,558 పాయింట్లకు పడిపోయింది. ఎస్ అండ్ పీ 500 కూడా 4 శాతం మేర కుంగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, యుద్ధ వార్తలతో అక్కడి ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

భారత మార్కెట్లలో మాత్రం మహా ప్రళయం కనిపిస్తోంది. ఫిబ్రవరి 26న 82,248 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, మార్చి 13 నాటికి 74,563 పాయింట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు దాదాపు 7,684 పాయింట్లను నష్టపోయారు. నిఫ్టీ కూడా 25,496 నుంచి 23,151 పాయింట్ల వద్దకు చేరింది. కేవలం ఒక్క శుక్రవారమే సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోవడం మార్కెట్ లోని భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాప్ రూ. 4.68 లక్షల కోట్ల నుంచి రూ. 4.29 లక్షల కోట్లకు తగ్గడంతో ఇన్వెస్టర్ల జేబులకు భారీ చిల్లు పడింది. రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమైతే జీడీపీ వృద్ధి రేటు తగ్గి, ఆర్థిక మాంద్యం దిశగా దేశం వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story