Credit Score : క్రెడిట్ స్కోర్ పెరగట్లేదా? మీ జేబుకు చిల్లు పెట్టే ఆ సీక్రెట్ తప్పులు ఇవే..ఇప్పుడే జాగ్రత్త పడండి

Credit Score : నేటి కాలంలో లోన్ కావాలన్నా, మంచి క్రెడిట్ కార్డ్ దక్కాలన్నా క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. చాలామంది తాము తీసుకున్న అప్పులకు ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కరెక్ట్‌గా సమయానికే కడుతున్నామని, అయినా తమ స్కోర్ మాత్రం పెరగడం లేదని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కొందరి స్కోర్ 500 వద్దే ఆగిపోతుంది, మరికొందరికి అది ఏమాత్రం ముందుకు కదలదు. కేవలం సమయానికి డబ్బులు కట్టడం మాత్రమే స్కోర్ పెరగడానికి సరిపోదు. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంటాయి. అసలు స్కోర్ పెరగకపోవడానికి గల కారణాలేంటో, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
మొదటిగా, చాలామంది ఒక్కసారి కదా బిల్లు కట్టడం లేట్ అయింది.. ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ క్రెడిట్ రిపోర్టులో ప్రతి ఒక్క లేట్ పేమెంట్ నమోదవుతుంది. ఒక్క రోజు ఆలస్యంగా కట్టినా అది మీ స్కోర్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుంది. బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ కస్టమర్‌గా చూసే అవకాశం ఉంది. అందుకే బిల్లులు మర్చిపోకుండా ఉండటానికి మొబైల్ రిమైండర్లు సెట్ చేసుకోవడం లేదా బ్యాంకులో ఆటో-డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది మీ క్రెడిట్ క్రమశిక్షణను పెంచుతుంది.
ఇక రెండో ప్రధాన కారణం క్రెడిట్ యుటిలైజేషన్. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు అనుకుందాం. మీరు ప్రతి నెలా 70 నుంచి 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నెల చివర్లో మొత్తం బిల్లు కడుతున్నప్పటికీ.. బ్యాంకుల దృష్టిలో మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం, మీ లిమిట్‌లో కేవలం 30 శాతం లోపు మాత్రమే వాడితే అది సేఫ్. అంతకంటే ఎక్కువ వాడటం వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనే సంకేతాలు వెళ్తాయి, ఫలితంగా స్కోర్ పెరగదు సరే కదా.. తగ్గే ప్రమాదం ఉంది.
చాలామంది పాత బాకీలు ఏమైనా ఉంటే వాటిని సెటిల్మెంట్ చేసుకుంటారు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఇక గొడవ వదిలిందని అనుకుంటారు. కానీ క్రెడిట్ రిపోర్టులో సెటిల్డ్ అనే ట్యాగ్ చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. లోన్ పూర్తిగా క్లోజ్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. అలాగే ఏవైనా చిన్న చిన్న పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నా అవి స్కోర్‌ను కిందకు లాగుతూనే ఉంటాయి. కాబట్టి పాత బాకీలను పూర్తిగా క్లియర్ చేసి, మీ క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేయించుకోవడం చాలా అవసరం.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మాటిమాటికీ లోన్ల కోసం లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం. మీరు అప్లై చేసిన ప్రతిసారీ బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేస్తాయి, దీన్నే హార్డ్ ఎంక్వయిరీ అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎంక్వయిరీలు జరిగితే.. మీకు అత్యవసరంగా డబ్బులు కావాలని, మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. దీనివల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడమే కాకుండా స్కోర్ కూడా పడిపోతుంది.
చివరగా మీ ప్రొఫైల్‌లో సరైన క్రెడిట్ మిక్స్ లేకపోవడం కూడా ఒక మైనస్. కేవలం అన్‌సెక్యూర్డ్ లోన్లు (పర్సనల్ లోన్లు వంటివి) మాత్రమే కాకుండా.. ఒక క్రెడిట్ కార్డ్ లేదా సెక్యూర్డ్ లోన్ ఉండి వాటిని బాధ్యతాయుతంగా చెల్లిస్తుంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి. క్రెడిట్ స్కోర్ 500 ఉన్నా కంగారు పడాల్సిన పనిలేదు. అది శాశ్వతం కాదు. సరైన ఖర్చు అలవాట్లు, సమయానికి చెల్లింపులు, లిమిట్ లోపు వాడకం వంటివి పాటిస్తే కొన్ని నెలల్లోనే మీ స్కోర్ రాకెట్‌లా దూసుకుపోతుంది. క్రెడిట్ స్కోర్ అనేది రాత్రికి రాత్రే పెరిగేది కాదు, దీనికి ఓపిక, క్రమశిక్షణ చాలా ముఖ్యం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

