Fixed Deposit : ఒకే బ్యాంకులో భారీ ఎఫ్‌డీ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. రిస్క్ ఎంతో తెలుసా?

Fixed Deposit : ఒకే బ్యాంకులో భారీ ఎఫ్‌డీ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. రిస్క్ ఎంతో తెలుసా?
X

Fixed Deposit : మన దేశంలో చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ అనగానే గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. ముఖ్యంగా పెద్ద బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటేనే సురక్షితం అని మనం నమ్ముతాం. కానీ, నిజం చెప్పాలంటే మీ ఎఫ్‌డీ భద్రత అనేది బ్యాంకు పేరు మీదో, దాని సైజు మీదో ఆధారపడి ఉండదు. అది కేవలం డిపాజిట్ ఇన్సూరెన్స్ రూల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పెద్ద బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా సరే, కొన్ని పరిమితులు ఉంటాయని మీరు ముందుగా తెలుసుకోవాలి.

బ్యాంకుల్లో మనం దాచుకునే డబ్బుకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) రక్షణ కల్పిస్తుంది. ఈ నిబంధన ప్రకారం, ఒక వ్యక్తికి ఒక బ్యాంకులో గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే బీమా రక్షణ ఉంటుంది. ఇందులో మీ అసలు, వడ్డీ రెండూ కలిసి ఉంటాయి. అది పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయినా, ప్రైవేట్ బ్యాంకు అయినా లేదా చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అయినా సరే.. ఈ రూల్ అందరికీ ఒకటే. ఉదాహరణకు, మీరు ఒక బ్యాంకులో రూ.7 లక్షలు ఎఫ్‌డీ చేశారనుకోండి.. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో పడితే, మీకు గ్యారెంటీగా వచ్చేది కేవలం రూ.5 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.2 లక్షలు రిస్క్‌లో ఉన్నట్లే లెక్క.

చాలా మంది చిన్న బ్యాంకులు లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తుంటే భయపడుతుంటారు. నిజానికి ఈ బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెద్ద బ్యాంకుల కంటే 0.2% నుంచి 0.7% వరకు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తాయి. ఇవి కూడా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే నడుస్తాయి. వీటికి కూడా రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న బ్యాంకులను ఎంచుకోవడంలో తప్పు లేదు, కానీ అక్కడ కూడా మీ డిపాజిట్ రూ.5 లక్షల లోపు ఉండేలా చూసుకోవడం తెలివైన పని.

పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నవారు తమ పెట్టుబడిని ఒకే బ్యాంకులో పెట్టకుండా వేర్వేరు బ్యాంకుల్లో పంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి బ్యాంకులో రూ.5 లక్షల లోపు ఎఫ్‌డీలు ఉంటే, మీ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ లభిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేవలం ఎఫ్‌డీల మీద మాత్రమే ఆధారపడకూడదు. ఎందుకంటే బ్యాంకుపై ఏదైనా మారటోరియం లేదా ఆంక్షలు విధిస్తే, అవసరానికి డబ్బు తీసుకోవడం కష్టమవుతుంది. అటువంటప్పుడు లిక్విడ్ ఫండ్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించడం మంచిది.

Tags

Next Story