Jeep Meridian Track Edition : రోడ్లపై రాజసం.. జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ వచ్చేసింది.

Jeep Meridian Track Edition : రోడ్లపై రాజసం.. జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ వచ్చేసింది.
X

Jeep Meridian Track Edition : లగ్జరీ ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీప్ ఇండియా, తాజాగా భారత మార్కెట్లోకి తన పాపులర్ మోడల్ మెరిడియన్‌లో సరికొత్త ట్రాక్ ఎడిషన్‎ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.35.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం తీసుకొచ్చిన 4x4 వెర్షన్ ధర రూ.37.82 లక్షలుగా నిర్ణయించారు. దీనికి అదనంగా రూ.9,200 విలువైన AXS ప్యాక్‌ను కస్టమర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా జీప్ ఈ కొత్త వేరియంట్‌ను ముస్తాబు చేసింది.

ఈ ట్రాక్ ఎడిషన్‌లో అత్యంత ఆకర్షణీయమైన మార్పు కారు లోపల జరిగింది. రెండో వరుస సీట్లను ఇప్పుడు 140 మిమీ వరకు ముందుకు, వెనక్కు జరుపుకోవచ్చు. దీనివల్ల మూడో వరుసలో కూర్చునే ప్రయాణికులకు లోపలికి వెళ్లడం, బయటకు రావడం చాలా సులభం అవుతుంది. అలాగే లెగ్ రూమ్ను తమకు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కంపెనీ ఈ సౌకర్యాన్ని జోడించింది.

మెరిడియన్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా వచ్చిన ఈ ట్రాక్ ఎడిషన్ బయట నుంచి చూస్తే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్ మరియు ఇతర భాగాలకు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. 18-అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కారుకు మంచి రాజసాన్ని తెచ్చిపెట్టాయి. బోనెట్‌పై సరికొత్త డీకాల్స్, వెనుక వైపు ట్రాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌తో కారును మరింత స్టైలిష్‌గా మార్చారు. లోపల కూడా డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీతో లగ్జరీ అనుభూతిని కలిగించేలా డిజైన్ చేశారు.

ఫీచర్ల పరంగా జీప్ మెరిడియన్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో 10.1-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. అలాగే 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వైపు వెంట్లేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి ప్రమాదాల నుంచి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.

ఈ ఎస్‌యూవీలో అదే నమ్మకమైన 2.0-లీటర్ మల్టీజెట్ II డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 170 hp పవర్, 350 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇది 2WD, 4WD ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్‌లో దీనికి టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

Tags

Next Story