Tata Motors : లగ్జరీ కార్ల తయారీకి కేరాఫ్ అడ్రస్ గా భారత్.. టాటా మోటార్స్ వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్.

Tata Motors : టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ రంగాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమైంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీని మన దేశంలోనే భారీ ఎత్తున చేపట్టబోతున్నట్లు టాటా సంస్థ సంచలన ప్రకటన చేసింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న పనాపక్కం ప్లాంట్‌లో ఫిబ్రవరి 9, 2026 నుంచి ఈ కార్ల అసెంబ్లీ ప్రారంభం కానుంది. సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక ఫ్యాక్టరీ, కేవలం భారత మార్కెట్ కోసమే కాకుండా, అగ్రరాజ్యం అమెరికాకు కూడా కార్లను ఎగుమతి చేసేలా వ్యూహాలు రచిస్తోంది.
టాటా మోటార్స్ చెన్నై సమీపంలోని పనాపక్కం వద్ద నిర్మించిన కొత్త ప్లాంట్ భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఏటా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు 5,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ప్రస్తుతం పుణె ప్లాంట్‌లో కేవలం కొన్ని విభాగాలను మాత్రమే అసెంబ్లీ చేస్తున్న టాటా, ఇప్పుడు పూర్తిస్థాయిలో లగ్జరీ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రయాణంలో మొదటగా రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌ను ఇక్కడ అసెంబ్లీ చేసే అవకాశం ఉందని సమాచారం. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇక్కడే తయారు చేసేలా లైన్లను సిద్ధం చేశారు.
భారతదేశం, అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం టాటా మోటార్స్‌కు పెద్ద వరంగా మారింది. ఈ ఒప్పందం వల్ల లభించే టారిఫ్ (పన్ను) మినహాయింపులను వాడుకుని, భారత్‌లో తయారైన జగువార్ ల్యాండ్ రోవర్ కార్లను అమెరికాకు ఎగుమతి చేయాలని టాటా భావిస్తోంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో భారత తయారీ రంగానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కార్ల డిమాండ్‌లో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ లాంటి దేశం నుంచి ఎగుమతులు చేయడం వల్ల కంపెనీకి ఆర్థికంగా పెద్ద లాభం చేకూరుతుంది.
కేవలం లగ్జరీ కార్లే కాకుండా, రాబోయే రోజుల్లో పనాపక్కం ప్లాంట్‌ను ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌గా మార్చాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం వెచ్చించిన రూ.9,000 కోట్లు కేవలం యంత్రాలకే కాకుండా, స్థానికతను పెంచడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే కారుకు కావాల్సిన విడిభాగాలను కూడా స్థానికంగానే తయారు చేయడం ద్వారా కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారతీయ లగ్జరీ కార్ల ప్రియులకు కూడా తక్కువ ధరకే జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి టాటా వేసిన ఈ భారీ స్కెచ్ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
