Kia Seltos Hybrid : కియా సెల్టోస్ హైబ్రిడ్ లాంచ్ డేట్ ఫిక్స్..ఇక ఆ ఎస్యూవీలతో గట్టి పోటీ తప్పదు.

Kia Seltos Hybrid : భారతదేశ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ ఎస్‌యూవీకి త్వరలో హైబ్రిడ్ పవర్‌ట్రైన్ అందించబడుతుందని కియా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఖర్చులను అదుపులో ఉంచడానికి, హైబ్రిడ్ భాగాలను దేశీయంగా తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెల్టోస్ హైబ్రిడ్‌ను భారతదేశంలో 2026 సంవత్సరం చివరిలో లేదా 2027 మొదటి భాగంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి జనరేషన్ సెల్టోస్ ఇప్పటికే సౌత్ కొరియా, అమెరికా మార్కెట్లలో హైబ్రిడ్ ఇంజిన్‌తో లభిస్తోంది.
సెల్టోస్ హైబ్రిడ్ భారతదేశంలో కియా నుంచి రాబోయే రెండవ హైబ్రిడ్ కారు కావచ్చు. అంతకుముందు మరొక కియా హైబ్రిడ్ కారు (బహుశా సోరెంటో) మార్కెట్‌లో విడుదల కావచ్చు. సెల్టోస్ హైబ్రిడ్‌కు సంబంధించిన ఇంజిన్ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఈ హైబ్రిడ్ సిస్టమ్ ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (సుమారు 115hp)పై ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం. అతుల్ సూద్ తెలిపిన ప్రకారం.. హైబ్రిడ్ ఇంజిన్ విడుదల సమయం ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే హైబ్రిడ్ భాగాల లోకలైజేషన్ పై కంపెనీ ప్రస్తుతం దృష్టి సారించింది. అయితే కియా 12 నుంచి 18 నెలల్లో సెల్టోస్ హైబ్రిడ్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
2030 నాటికి కియా మొత్తం అమ్మకాలలో 25 శాతం వాటా హైబ్రిడ్ వాహనాల నుంచే రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సెల్టోస్ హైబ్రిడ్ అంచనా ధర రూ. 11.25 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 20 లక్షల పైకి వెళ్లవచ్చు. ఈ సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువగా ఉన్నందున, ధర కీలకం. అందుకే బ్యాటరీ ప్యాక్, మోటార్, కంట్రోల్ యూనిట్, ఇన్వర్టర్ వంటి హైబ్రిడ్ భాగాలను దేశీయంగా తయారు చేయడం చాలా అవసరం. స్థానికీకరణ లేకపోతే, హైబ్రిడ్ టెక్నాలజీ ధర చాలా పెరుగుతుంది. ఇది సెల్టోస్ అమ్మకాలపై ప్రభావం చూపవచ్చు.
ప్రస్తుతం కియా పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉన్నాయి. హైబ్రిడ్ కార్లు ప్రవేశించిన తర్వాత కియాకు ప్రతిపాదిత CAFE 3 నిబంధనల నుంచి కూడా ప్రయోజనం లభిస్తుంది. ఈ నిబంధనలలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు అదనపు రాయితీలు, సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. కియా హైబ్రిడ్ కార్లు మార్కెట్‌లో ఉన్న టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలతో పాటు, హ్యుందాయ్, ఎంజీ వంటి ఇతర కంపెనీలు రాబోయే హైబ్రిడ్ ఎస్‌యూవీలతో కూడా తీవ్రంగా పోటీపడనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

