Kia Sonet : కియా సోనెట్ సరికొత్త రికార్డు.. 5 లక్షల మంది మనసు గెలుచుకున్న ఎస్‌యూవీ.

Kia Sonet : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ఈ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దక్షిణ కొరియా దిగ్గజం కియా ఇండియా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆ సంస్థకు చెందిన పాపులర్ మోడల్ కియా సోనెట్ దేశీయ మార్కెట్లో ఐదు లక్షల అమ్మకాల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. 2020 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ కారు, కేవలం ఐదేళ్ల లోపే ఈ ఘనత సాధించడం విశేషం.
కియా సోనెట్ విజయం వెనుక ఒక పటిష్టమైన వ్యూహం ఉంది. కియా తన కార్లను ఎప్పుడూ ప్రీమియం విభాగంలోనే ఉంచుతుంది. సోనెట్ కూడా అదే బాటలో నడిచి, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వచ్చింది. కియా ఇండియా మొత్తం అమ్మకాలలో సోనెట్ వాటానే సుమారు 35 శాతం ఉండటం గమనార్హం. ముఖ్యంగా గత రెండేళ్లుగా వరుసగా ఏడాదికి ఒక లక్షకు పైగా సోనెట్ కార్లు అమ్ముడవుతూ ఉండటం ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. 2024లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ పాపులారిటీని మరింత పెంచింది.
కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా సోనెట్ తన సత్తా చాటుతోంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో తయారైన ఈ కారు 70కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పటివరకు ఒక లక్షకు పైగా సోనెట్ కార్లు విదేశాలకు ఎగుమతి కావడం విశేషం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన డిజైన్, నాణ్యత దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. దేశీయంగా కియా సోనెట్ ప్రారంభ ధర రూ.7.30 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.13.65(ఎక్స్-షోరూమ్) లక్షల వరకు ఉంది.
సోనెట్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది దాని ఇంజిన్ ఆప్షన్లు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కియా అందిస్తోంది. వీటితో పాటు 6-స్పీడ్ మాన్యువల్, iMT, అడ్వాన్స్‌డ్ 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి వెరైటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కొత్తగా కారు కొనేవారికి, ముఖ్యంగా సిటీ డ్రైవింగ్, లాంగ్ జర్నీలు రెండింటికీ కావాలనుకునే వారికి సోనెట్ ఒక ఆల్ రౌండర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. సోనెట్ ఈ సెగ్మెంట్లోనే టాప్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండు 10.25-ఇంచుల స్క్రీన్లు (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), వెంటిలేటెడ్ సీట్లు, బోస్ ఆడియో సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రతకు కూడా కియా పెద్దపీట వేసింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుండగా, హై-ఎండ్ వేరియంట్లలో లెవల్ 1 ADAS టెక్నాలజీ ఉంది. లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలో అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కంప్లీట్ ప్యాకేజీ వల్లే కియా సోనెట్ మార్కెట్లో రారాజుగా దూసుకుపోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
