Kia Sorento : ఫార్చ్యూనర్ కి గట్టి పోటీ..కియా నుంచి భారీ ఎస్‌యూవీ.

Kia Sorento : ఫార్చ్యూనర్ కి గట్టి పోటీ..కియా నుంచి భారీ ఎస్‌యూవీ.
X

Kia Sorento : దక్షిణ కొరియా దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ కియా భారత మార్కెట్లోకి ఒక భారీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి బలమైన కార్లకు పోటీగా కియా తన సోరెంటో మోడల్‌ను భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తోంది. మూడు వరుసల సీటింగ్ (7-సీటర్), పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు ఈ ఏడాది చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట్లో కియా సోరెంటోను విదేశాల నుంచి నేరుగా భారత్‌కు తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. కానీ, అలా చేస్తే పన్నుల భారం వల్ల కారు ధర విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే, ఇప్పుడు కియా ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లోనే ఈ కారును అసెంబుల్ చేయాలని నిర్ణయించింది. అంటే విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చి ఇక్కడే కారును తయారు చేస్తారు. దీనివల్ల కారు ధర సామాన్య ప్రీమియం కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ కారును పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీగా మార్చాలనేది కియా లక్ష్యం.

కియా సోరెంటో సైజ్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. దీని పొడవు 4,815 మి.మీ, వెడల్పు 1,900 మి.మీ గా ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉండబోతోంది. అలాగే టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి కార్ల కంటే కూడా ఇది పరిమాణంలో పెద్దది. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2,815 మి.మీ కాబట్టి, కారు లోపల లెగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. ఏడుగురు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని భారీ లుక్ రోడ్డుపై వెళ్తుంటే రాజసం ఉట్టిపడేలా ఉంటుంది.

సోరెంటోలోని ప్రధాన ఆకర్షణ దాని హైబ్రిడ్ ఇంజిన్. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, దీనికి 59 bhp పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ తోడవుతుంది. వెరసి ఇది దాదాపు 230 bhp నుంచి 238 bhp వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. భారత్ కోసం కియా తన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడ్ టెక్నాలజీతో అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో 6స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. అలాగే కస్టమర్ల ఛాయిస్ ని బట్టి ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉండవచ్చు.

ప్రీమియం ఎస్‌యూవీ కాబట్టి ఇందులో ఫీచర్లకు కొదవ లేదు. లెవల్ 2 ADAS వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. పనోరమిక్ డ్యూయల్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని విలాసవంతంగా మారుస్తాయి. దీని ఇంటీరియర్ డిజైన్ చాలా ప్రీమియంగా, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ తో ఉండబోతోంది. 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

Tags

Next Story