Kia Syros EV : అనంతపురం రోడ్లపై కియా సైరోస్ ఈవీ సందడి.. సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం.

Kia Syros EV : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కియా మోటార్స్ తన జోరును పెంచుతోంది. ఇప్పటికే EV6, EV9, త్వరలో రాబోతున్న క్యారెన్స్ ఈవీ వంటి మోడళ్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న కియా, ఇప్పుడు తన నాలుగో ఎలక్ట్రిక్ అస్త్రం కియా సైరోస్ ఈవీని సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా ప్లాంట్ సమీపంలో ఈ కారును ఇటీవలే టెస్టింగ్ చేస్తూ ఉండగా వాహన ప్రియుల కంట పడింది. అధునాతన డిజైన్, అద్భుతమైన రేంజ్‌తో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిజైన్ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ తన రెగ్యులర్ మోడల్ కంటే భిన్నంగా ఉండబోతోంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నప్పటికీ, ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. కేవలం బంపర్ కింద మాత్రమే గ్రిల్ ఓపెనింగ్ ఉంటుంది. ఇందులో యాక్టివ్ ఫ్లాప్స్ అనే సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఇవి అవసరమైనప్పుడు మాత్రమే తెరుచుకుంటూ గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి, దీనివల్ల కారు వేగంగా వెళ్లడమే కాకుండా బ్యాటరీ ఖర్చు కూడా తగ్గుతుంది. 17 అంగుళాల స్పెషల్ అల్లాయ్ వీల్స్, రూఫ్‌తో కలిసిపోయినట్లు ఉండే రూఫ్ రైల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
లోపల ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ కారులో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. అంటే ఇటు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రెండూ కూడా 12.3 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేలతో రానున్నాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కంట్రోల్ చేయడానికి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. కంఫర్ట్ కోసం వెంట్లేటెడ్ సీట్లు, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, 8 స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. డ్రైవర్ సౌకర్యార్థం 4-వే పవర్ అడ్జస్ట్‌మెంట్ సీట్ కూడా ఉంది.
సేఫ్టీకి కియా పెద్దపీట వేసింది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు 360 డిగ్రీల కెమెరా, డ్యూయల్ డ్యాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండబోతున్నాయి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది సింగిల్ మోటార్ వేరియంట్లలో లభించనుంది. దీని ఎక్స్‌టెండెడ్ రేంజ్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 475 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి కియా సైరోస్ ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
