Land Rover : ఫార్చ్యూనర్ రేటుకే ల్యాండ్ రోవర్.. ఇక రోడ్లన్నీ లగ్జరీ కార్లమయమే.

Land Rover : ఫార్చ్యూనర్ రేటుకే ల్యాండ్ రోవర్.. ఇక రోడ్లన్నీ లగ్జరీ కార్లమయమే.
X

Land Rover : లగ్జరీ కార్ల ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఇండియాలో లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎంతలా అంటే కోట్లు పలికే ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి కార్లు దాదాపు సగం ధరకే దొరికే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందంతో లగ్జరీ కార్ల మార్కెట్ లెక్కలన్నీ తలకిందులు కానున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ ఒప్పందం వల్ల ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో తయారై నేరుగా ఇండియాకు వచ్చే (CBU) కార్లపై ఇప్పటివరకు ఉన్న 110 శాతం దిగుమతి సుంకం ఇప్పుడు 40 శాతానికి పడిపోనుంది. రాబోయే కాలంలో ఇది కేవలం 10 శాతానికి చేరుకోనుంది. దీని ప్రభావం ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి పవర్‌ఫుల్ ఎస్‌యూవీలపై స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర భారత్ లో దాదాపు రూ.1.03 కోట్లుగా ఉంది. ఇందులో కారు అసలు ధర సుమారు రూ.35 లక్షలు అయితే, దానిపై పన్నులే రూ.68 లక్షల వరకు ఉంటున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం పన్ను 110% నుంచి 40%కి తగ్గితే, ఈ కారు ధర నేరుగా రూ.68.6 లక్షలకు పడిపోతుంది. ఇక ఒప్పందంలోని తుది దశలో పన్ను కేవలం 10 శాతానికి తగ్గితే, డిఫెండర్ కారు కేవలం రూ.53.9 లక్షలకే దొరికే అవకాశం ఉంది.

ఈ లెక్కన చూస్తే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర దాదాపు టయోటా ఫార్చ్యూనర్ ధరతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ టాప్ వేరియంట్ ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉంది. కేవలం మరికొన్ని లక్షలు అదనంగా చెల్లిస్తే, ప్రపంచస్థాయి లగ్జరీ కారు అయిన డిఫెండర్ మీ సొంతమవుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, భవిష్యత్తులో జరగబోయే వాస్తవం ఇదే. అయితే ఈ ధరల తగ్గింపు అనేది తక్షణమే జరగదు. దశలవారీగా పన్నులను తగ్గిస్తూ 2028 నాటికి ఈ పూర్తి స్థాయి తక్కువ ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఒప్పందంలో ఒక చిన్న మెలిక కూడా ఉంది. ఈ పన్ను తగ్గింపు అనేది సంవత్సరానికి కేవలం 25 లక్షల యూనిట్ల దిగుమతులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా విదేశాల్లో పూర్తిగా తయారైన మోడళ్లకు మాత్రమే. ల్యాండ్ రోవర్ డిఫెండర్ స్లోవేకియాలో తయారవుతుంది కాబట్టి, ఈ ఒప్పందం దానికి వరంలా మారింది. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో లగ్జరీ కార్ల మార్కెట్‌లో భారీ మార్పులు రావడం ఖాయం. కోట్లు పెట్టి కొనే కార్లు లక్షల్లోనే అందుబాటులోకి వస్తే సామాన్యులు కూడా లగ్జరీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Tags

Next Story