LIC : FD కంటే LIC న్యూ జీవన్ శాంతి బెస్ట్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం పెన్షన్ గ్యారంటీ!

LIC : FD కంటే LIC న్యూ జీవన్ శాంతి బెస్ట్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం పెన్షన్ గ్యారంటీ!
X

LIC : పదవీ విరమణ తర్వాత జీవితం ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రిస్క్ లేకుండా, జీవితాంతం క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పెన్షన్ ప్లాన్స్ ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి యోజన పథకం బాగా ప్రాచుర్యం పొందుతోంది. కేవలం ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం పెన్షన్‌ను పొందడానికి వీలు కల్పించే ఈ సూపర్ హిట్ పాలసీ వివరాలను, దాని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ అందించే ఈ న్యూ జీవన్ శాంతి యోజన అనేది ఒక సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్. అంటే, పాలసీదారుడు కేవలం ఒక్కసారి మాత్రమే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, దానికి ప్రతిఫలంగా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో పెన్షన్ తీసుకునే విధానంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పెన్షన్‌ను మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా ఎంచుకోవచ్చు. ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు పెట్టుబడి పెట్టిన వెంటనే, భవిష్యత్తులో మీకు ఎంత పెన్షన్ వస్తుంది అనే దానిపై గ్యారంటీ లభిస్తుంది.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎవరైనా తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీసం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు. 30 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో ముఖ్యంగా రెండు రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని పాలసీదారు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. తక్షణ పెన్షన్ ఆప్షన్‌ మీరు పెట్టుబడి పెట్టిన వెంటనే (తదుపరి నెల లేదా త్రైమాసికం నుంచి) మీకు పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. పదవీ విరమణ చేసిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

వాయిదా వేసిన పెన్షన్ ఆప్షన్‌లో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు ఎంచుకున్న నిర్ణీత కాలం (ఉదా. 5 సంవత్సరాలు) పూర్తయ్యాక పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్‌లో పెట్టుబడిపై ఎంత పెన్షన్ వస్తుందో ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి 55 సంవత్సరాల వయస్సులో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి, 5 సంవత్సరాల పాటు వాయిదా ఆప్షన్ ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు నుంచి అతనికి సంవత్సరానికి సుమారు రూ.1,02,850 పెన్షన్ లభిస్తుంది. అంటే, నెలకు సుమారు రూ.8,570. ఈ పథకంలో రెండు రకాల లైఫ్ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ లైఫ్ ఆప్షన్లో పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. జాయింట్ లై ఆప్షన్‌లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్ లభిస్తుంది. పాలసీదారు మరణించిన తర్వాత, మిగిలిన జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత జమ చేసిన మొత్తం నామినీకి తిరిగి చెల్లిస్తారు.

Tags

Next Story