Bank Locker : బ్యాంక్ లాకర్ కీ పోయిందా? ఆందోళన వద్దు.. కొత్త కీ పొందే మార్గాలు ఇవే.

Bank Locker : బ్యాంక్ లాకర్లు మన విలువైన ఆభరణాలకు, ముఖ్యమైన డాక్యుమెంట్లకు అత్యంత రక్షణనిచ్చే ప్రదేశాలు. కానీ పొరపాటున ఆ లాకర్ కీని (తాళం చెవిని) పోగొట్టుకుంటే మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే.. బ్యాంకు దగ్గర డూప్లికేట్ కీ ఉంటుందని, దాంతో తీయొచ్చని అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. ఒకవేళ మీరు లాకర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలో, ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంక్ లాకర్‌కు రెండు తాళం చెవులు ఉంటాయి. అందులో ఒకటి బ్యాంకు వద్ద (మాస్టర్ కీ), మరొకటి కస్టమర్ వద్ద ఉంటుంది. లాకర్ తెరవాలంటే ఈ రెండు కీలు ఒకేసారి ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాంకు దగ్గర ఉండే మాస్టర్ కీతో మాత్రమే లాకర్‌ను విడిగా తెరవడం సాధ్యం కాదు. అందుకే కస్టమర్ తన వద్ద ఉన్న కీని పోగొట్టుకుంటే, ఆ తాళం పగులగొట్టడం లేదా లాకర్ సిలిండర్‌ను మార్చడం తప్ప మరో మార్గం ఉండదు. ఆ ప్రక్రియ ఇలా సాగుతుంది:
ముందుగా మీరు కీ పోగొట్టుకున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా సమాచారం అందించాలి. ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కీ పోయినట్లు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని పొందాలి. ఈ పోలీస్ రిపోర్ట్ కాపీని బ్యాంకుకు సమర్పించడం తప్పనిసరి. మీరు జాయింట్ అకౌంట్ హోల్డర్ అయితే, ఖాతాలో ఉన్న అందరూ కలిసి బ్యాంకుకు వెళ్లి దరఖాస్తుపై సంతకం చేయాల్సి ఉంటుంది. బ్యాంకు మీ నుంచి ఒక అండర్ టేకింగ్ లెటర్ కూడా తీసుకుంటుంది.
ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత, బ్యాంకు అధికారులు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో లాకర్ తయారీ కంపెనీ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుడు, బ్యాంక్ అధికారి మరియు కస్టమర్ సమక్షంలో లాకర్‌ను పగులగొడతారు. లోపల ఉన్న వస్తువులను సురక్షితంగా బయటకు తీసి, మరో కొత్త లాకర్‌ను కేటాయించడం లేదా పాత లాకర్‌కు కొత్త తాళం సిస్టమ్‌ను అమర్చడం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి అయ్యే ఖర్చును (తాళం పగులగొట్టడం, కొత్త తాళం అమర్చడం, మెకానిక్ ఛార్జీలు) కస్టమరే భరించాలి. ఈ ఖర్చు కొన్ని వేల రూపాయల వరకు ఉండవచ్చు.
అంతేకాకుండా లాకర్ కీ పోగొట్టుకోవడం వల్ల భద్రతా పరమైన ముప్పు కూడా ఉంటుంది. ఒకవేళ అది ఎవరికైనా దొరికితే, వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. కొన్ని బ్యాంకులు పాత లాకర్‌ను పూర్తిగా రద్దు చేసి, కొత్త లాకర్‌ను మాత్రమే కేటాయిస్తాయి. అందుకే మీ విలువైన ఆభరణాలు భద్రంగా ఉండాలంటే, ఆ లాకర్ తాళం చెవిని కూడా ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
