Car Exports : మేడ్-ఇన్-ఇండియా కార్ల హవా..ఎగుమతిలో కొత్త రికార్డుకు సిద్ధం.

Car Exports : ప్రపంచ వ్యాప్తంగ మేడ్-ఇన్-ఇండియా కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం 2026 మొదటి 8 నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) భారతదేశం నుంచి విదేశాలకు ప్రయాణీకుల వాహనాల ఎగుమతి రికార్డు స్థాయిలో దాదాపు 6 లక్షల యూనిట్లకు చేరింది. SIAM (సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) డేటా ప్రకారం.. 5,99,276 ప్రయాణీకుల వాహనాలను ఎగుమతి చేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరం (FY2025) ఇదే కాలంతో పోలిస్తే 20% ఎక్కువ వృద్ధిని సూచిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2026లో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉన్నప్పటికీ, ఈ ప్రదర్శన భారతదేశాన్ని FY2025లో సాధించిన 7,70,364 యూనిట్ల అత్యధిక ఎగుమతి రికార్డుకు చాలా దగ్గరగా తీసుకెళ్లింది. ఈ 8 నెలల్లో మూడు సార్లు నెలవారీ ఎగుమతులు 80,000 యూనిట్ల మార్కును దాటాయి.
భారతదేశానికి చెందిన కార్ల ఎగుమతులకు శుభవార్త వస్తున్నప్పటికీ, మెక్సికో దేశం తీసుకున్న ఒక నిర్ణయం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. 2026 జనవరి 1 నుంచి, మెక్సికో భారతీయ ప్రయాణీకుల వాహనాలపై దిగుమతి సుంకాన్ని 20% నుంచి 50% కి పెంచనుంది. సౌతాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత భారతదేశానికి మెక్సికో మూడవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఆర్థిక సంవత్సరం 2024లో, మెక్సికో భారతదేశం నుంచి దాదాపు 1,94,000 కార్లు, ఎస్‌యూవీలను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం ఎగుమతుల్లో 25% వాటా. ఈ టారిఫ్ పెంపు కారణంగా దాదాపు $1.9 బిలియన్ల (రూ.15,800 కోట్ల) విలువైన ఈ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేని దేశాల నుంచి దిగుమతులపై ఈ టారిఫ్‌ను పెంచుతోంది.
మెక్సికో మార్కెట్ భారతీయ కార్ల తయారీదారులకు చాలా కీలకం. ప్రధానంగా మారుతి సుజుకి ఇండియా సంవత్సరానికి 66,000 నుంచి 70,000 యూనిట్లను ఎగుమతి చేస్తుంది. వీటిలో బలెనో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి ప్రముఖ మోడల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా 25,000 నుంచి 30,000 యూనిట్లను (గ్రాండ్ i10 నియోస్, ఔరా, వెన్యూ, క్రెటా) మెక్సికోకు పంపుతుంది. అలాగే వోక్స్‌వ్యాగన్ గ్రూప్ వర్టస్, స్లావియా, టైగన్, కుషాక్ వంటి 55,000 నుంచి 60,000 యూనిట్లను ఎగుమతి చేస్తుంది. నిస్సాన్ ఇండియా కూడా మాగ్నైట్ ఎస్‌యూవీలను (మెక్సికోలో కిక్స్ పేరుతో) పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ఈ కఠినమైన టారిఫ్ పెంపుదల ప్యాసింజర్ వెహికల్, టూ-వీలర్ విభాగాలలో భారతీయ ఆటో కంపెనీలకు సవాలుగా మారనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

