IPHONES: 'మేడిన్ ఇండియా' ఐఫోన్లు అమెరికాకే..!

IPHONES: మేడిన్ ఇండియా ఐఫోన్లు అమెరికాకే..!
X
భారత్​కు కలిసొచ్చిన ట్రంప్ టారిఫ్స్... ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాట్లు

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తి వ్యూహంలో భారీ మార్పులు చేస్తోంది. ఒకప్పుడు దాదాపుగా అన్ని ఉత్పత్తుల తయారీకి కేరాఫ్‌గా నిలిచిన చైనాకు క్రమంగా స్వస్తి పలుకుతోంది. తాజాగా భారత్‌లో తయారవుతున్న ఐఫోన్లలో అత్యధిక భాగం ఇకపై అమెరికా మార్కెట్‌లోకే వెళ్లనున్నాయి. ఇందుకోసం యాపిల్‌తో పాటు దాని భాగస్వామ్య తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా భారతీయ తయారీ ఐఫోన్‌లకు అమెరికా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది.

100 యాపిల్ ఫోన్లలో 80 ఫోన్లు

ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం నాటికి భారత్‌లోని ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ ఫ్యాక్టరీల నుంచి కనీసం 12-14 బిలియన్‌ డాలర్ల ఫోన్లను అక్కడికి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ త్రైమాసికం తర్వాత కూడా ఇదే స్థాయిలో ఎగుమతులు చేయగలిగితే 2026 ఆర్థిక సంవత్సరానికి 40 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్‌ ఎగుమతి చేసినట్లు అవుతుంది. మన దేశంలో తయారయ్యే 100 యాపిల్‌ ఫోన్లలో 80 ఫోన్లు అమెరికాకే చేరనున్నాయి. అమెరికా మార్కెట్‌లో జూన్‌ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటామని యాపిపక్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.

గతేడాది 4 నుంచి 4.5 కోట్ల ఐఫోన్ల తయారీ

గతంలో భారత్‌లో తయారుచేసిన ఐఫోన్లు యూకే, తుర్కియే, జపాన్‌ వంటి మార్కెట్లకు ఎగుమతి అయ్యేవి కానీ, వాటిని ఇప్పుడు అమెరికాకు మళ్లించారు. ఈ భారీ డిమాండ్‌ను అందుకోవాలంటే యాపిల్.. భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 22 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. గతేడాది భారత్‌ 4 నుంచి 4.5 కోట్ల ఐఫోన్లను తయారుచేసింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొత్తం విక్రయాల్లో 20శాతం వరకు ఉంటాయి. భారత్‌లో తయారైన ఐఫోన్లలో 1.5 కోట్ల వరకు అమెరికాకు, 1.3 కోట్లు ఇతర విదేశీ మార్కెట్లకు, 1.2 కోట్ల ఫోన్లు దేశీయ మార్కెట్లో యాపిల్‌ విక్రయించింది. మార్చి నెలలో భారత్‌లో తయారైన ఐఫోన్లలో 98శాతం అమెరికాకు చేరుకున్నాయి. అదే ఫిబ్రవరిలో 84శాతం అగ్రరాజ్య మార్కెట్‌కు వెళ్లాయి.

Tags

Next Story