Mahindra : జీఎస్టీ కోతతో బంపర్ లాభం.. ఒకే నెలలో మహీంద్రా డబుల్ రికార్డ్

Mahindra : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2025 నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు కారణం జీఎస్టీ 2.0 తగ్గింపులు, నవరాత్రి పండుగ అని కంపెనీ తెలిపింది. కేవలం ఒక్క నెలలోనే మహీంద్రా నెలవారీ అమ్మకాలలో రెండు కీలక రికార్డులు ఎలా సృష్టించిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ 2025లో దేశీయ ప్యాసింజర్ వాహనాల భాగంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది.సెప్టెంబర్ 2025లో 56,233 యూనిట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 2024లో సాధించిన 54,504 యూనిట్ల కంటే ఇది ఎక్కువ.
గత సంవత్సరం సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 51,062 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల్లో ఏకంగా 10% వార్షిక వృ నమోదైంది. దీనితో పాటు, ఎగుమతులతో సహా కంపెనీ మొత్తం ఆటో అమ్మకాలు సెప్టెంబర్‌లో 1,00,298 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది 16% వృద్ధిని సూచిస్తుంది. యూటిలిటీ వెహికల్ అమ్మకాలు, ఎగుమతులతో సహా, 58,714 యూనిట్లుగా ఉన్నాయి.
ఈ రికార్డు అమ్మకాల వెనుక ప్రధాన కారణాలు జీఎస్టీ 2.0 సంస్కరణలు, నవరాత్రి పండుగ అని మహీంద్రా స్పష్టం చేసింది. జీఎస్టీ 2.0 అమలు కావడం, వాయిదా పడిన డిమాండ్ కారణంగా, నవరాత్రి మొదటి 9 రోజుల్లో ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో 60% కంటే ఎక్కువ వృద్ధి కనిపించింది.
ఈసారి నవరాత్రి పండుగ కొంచెం ముందుగా సెప్టెంబర్‌లోనే రావడంతో, పండుగ కోసం కొనుగోళ్లను వాయిదా వేసుకున్న కస్టమర్లు కొత్త జీఎస్టీ ప్రయోజనాలు అందిన వెంటనే కొనుగోలు చేశారు. ఈ ట్యాక్స్ సంస్కరణలు, పండుగ సమయం కలిసి రిటైల్ అమ్మకాల్లో భారీ పెరుగుదలకు దోహదపడ్డాయి.
సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా, చిన్న కార్లపై ట్యాక్స్‌ను 28% నుంచి 18%కి తగ్గించారు. దీనితో పాటు కాంపెన్సేషన్ సెస్ ను తొలగించారు. ఈ నిర్ణయం ప్రధానంగా కాంపాక్ట్ ఎస్‌యూవీల (1,200సీసీ వరకు పెట్రోల్, 1,500సీసీ వరకు డీజిల్, 4,000 మిమీ కంటే తక్కువ పొడవు)పై ఎక్కువ ప్రభావం చూపింది.
మహీంద్రా కంపెనీ ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్‌లకు బదిలీ చేసింది. ఫలితంగా, కొన్ని మోడళ్ల ధరలు రూ.లక్ష వరకు తగ్గాయి. ట్యాక్స్ ప్రయోజనాలు లభిస్తాయనే అంచనాతో కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులందరూ, జీఎస్టీ సంస్కరణలు అమలు కాగానే పెద్ద ఎత్తున కార్లను కొనుగోలు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com