Vision S : ఆటోమొబైల్ రంగంలో సంచలనం..మహింద్రా కొత్త ఎస్‌యూవీ డిజైన్ చూస్తే మైండ్ బ్లాకే.

Vision S : భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ సిరీస్‌లతో మార్కెట్‌ను ఏలుతున్న మహింద్రా, ఇప్పుడు సబ్-4 మీటర్ విభాగంలో సరికొత్త విజన్ ఎస్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్ మోడల్ రోడ్లపై కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కింది. దీనితో ఈ కారు డిజైన్, అందులో ఉండబోయే హై-టెక్ ఫీచర్ల గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త మోడల్ కేవలం కాన్సెప్ట్‌కే పరిమితం కాకుండా, ప్రొడక్షన్ దశకు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.
లీక్ అయిన ఫోటోలను గమనిస్తే, మహింద్రా విజన్ ఎస్ పక్కా బాక్సీ లుక్ తో, స్ట్రెయిట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ముందు భాగంలో గుండ్రటి హెడ్‌లైట్లు, నిలువుగా ఉండే గ్రిల్ మరియు హాలోజన్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇది చూడటానికి క్లాసిక్ ఆఫ్-రోడర్ లాగా ఉన్నప్పటికీ, ఆధునిక సొబగులను అద్దుకుంది. ఈ కారులో డీజిల్ ఫిల్లర్ పక్కనే AdBlue రీఫిల్ క్యాప్ కూడా ఉంది, దీనిని బట్టి ఈ కారులో BS6 ఫేజ్-II నిబంధనలకు అనుగుణంగా ఉండే శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ ఉపయోగిస్తోందని స్పష్టమవుతోంది.
కారు లోపలి భాగాన్ని పరిశీలిస్తే, మహింద్రా తన కస్టమర్లకు విలాసవంతమైన అనుభూతిని అందించబోతోందని అర్థమవుతోంది. ఈ కారులో మొదటిసారిగా పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్‌ను ప్రవేశపెట్టారు, ఇది కారు లోపల విశాలమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి. వెనుక సీట్లకు విడివిడిగా హెడ్‌రెస్ట్‌లు ఇవ్వడంతో పాటు, లగేజీ కోసం 60:40 స్ప్లిట్ రేషియో సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండటం విశేషం.
మహింద్రా విజన్ ఎస్ సరికొత్త NU IQ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే, ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారు 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్నప్పటికీ, 2.65 మీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల కారు లోపల మంచి స్థలం లభిస్తుంది. అంతేకాదు ఇది 28 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 34.9 డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది, అంటే కొండలు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది సునాయాసంగా వెళ్లగలదు.
విజన్ ఎస్ ఎస్‌యూవీలో పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లు ఉండబోతున్నాయి. పెట్రోల్ వేరియంట్‌లో XUV 3XO నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇక డీజిల్ వేరియంట్‌లో థార్ ఎంట్రీ-లెవల్ మోడల్ నుంచి తీసుకున్న 1.5 లీటర్ ఇంజిన్‌ను అమర్చవచ్చు. ఈ కారును మహింద్రా తన ప్రసిద్ధ స్కార్పియో బ్రాండ్ కింద ఒక లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్‌గా లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఇది దాదాపు 2027 నాటికి భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. విజన్ ఎస్ తో పాటు విజన్ ఎక్స్, విజన్ టి వంటి మరికొన్ని మోడళ్లను కూడా మహింద్రా పైప్‌లైన్‌లో ఉంచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
