Mahindra XUV 3XO EV : మహీంద్రా XUV 3XO ఈవీ వచ్చేసింది..టాటా నెక్సాన్ ఈవీకి ఇక చుక్కలేనా?

Mahindra XUV 3XO EV : మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ XUV 3XOలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. తన పెద్దన్న XUV 7XO విడుదలైన మరుసటి రోజే ఇది రావడం విశేషం. ముఖ్యంగా సిటీలో తిరిగే వారిని, బడ్జెట్‌లో మంచి ఈవీ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని మహీంద్రా ఈ కారును డిజైన్ చేసింది.
మహీంద్రా XUV 3XO EV ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ AX5 EV ధర రూ.13.89 లక్షలు కాగా, టాప్ ఎండ్ AX7L EV ధర రూ.14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరలు పెట్రోల్ టాప్ మోడల్ ధరలతో దాదాపు సమానంగా ఉండటం విశేషం. కొన్ని రాష్ట్రాల్లో లభించే ప్రభుత్వ సబ్సిడీల వల్ల ఆన్-రోడ్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరి 23, 2026 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ఈవీలో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో 285 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వేగం విషయంలో కూడా ఇది తక్కువ తినలేదు. కేవలం 8.3 సెకన్లలోనే సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. డ్రైవర్ సౌలభ్యం కోసం ఇందులో ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
XUV 3XO EV ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ దాదాపు పెట్రోల్ వెర్షన్‌లానే ఉన్నా, ఈవీ కోసం చిన్న మార్పులు చేశారు. ఇందులో రెండు 10.25-అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ & డిజిటల్ క్లస్టర్) ఇచ్చారు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, మరియు లెవల్-2 ADAS (టాప్ వేరియంట్‌లో) వంటి హై-ఎండ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లగ్జరీ ఫీచర్లను అందించారు.
ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ నిండుతుంది. ఒకవేళ ఇంట్లో 7.2 kW AC ఛార్జర్ వాడితే, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 6.5 గంటల సమయం పడుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

