Mahindra XUV 7XO : రోడ్డు మీద ఇక మహీంద్రా రాజసం..జనవరి 5న XUV 7XO లాంచ్.

Mahindra XUV 7XO : మహీంద్రా కార్లంటేనే ఒక రేంజ్.. అలాంటిది తన పాపులర్ ఎస్‌యూవీ XUV700ని సరికొత్త హంగులతో, సరికొత్త పేరుతో మార్కెట్లోకి తెస్తోంది. జనవరి 5, 2026న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV 7XO ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పేరు మారడమే కాదు, ఇందులో ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మహీంద్రా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్ XEV 9e లోని లగ్జరీ ఫీచర్లను కూడా ఈ కొత్త XUV 7XO లో జొప్పించారు.
మహీంద్రా XUV 7XO లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన అంశం ట్రిపుల్ స్క్రీన్ సెటప్. డ్యాష్‌బోర్డ్‌లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి, ఇక పక్కన కూర్చునే కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మూడో స్క్రీన్‌ను అమర్చారు. ఇది కాకుండా ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఈ కారు సొంతం. వెనుక కూర్చునే వారికి కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు సన్‌షేడ్స్ ఇవ్వడం విశేషం.
ఫీచర్లు మారినా, ఇంజిన్ నమ్మకమైన పాత XUV700 పవర్‌నే కొనసాగిస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (200 PS పవర్, 380 Nm టార్క్), 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (185 PS పవర్, 450 Nm టార్క్) ఆప్షన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంచుకోవచ్చు. రోడ్డుపై దూసుకుపోవడానికి, ఆఫ్-రోడింగ్‌లో పవర్ చూపించడానికి ఈ ఇంజిన్లు పక్కాగా సరిపోతాయి.
మహీంద్రా ఈ సరికొత్త XUV 7XO బేస్ వేరియంట్ ధరను ప్రస్తుతం ఉన్న XUV700 ధరలకే అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. అయితే టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు మాత్రం ఫీచర్లకు అనుగుణంగా కొంచెం పెరగవచ్చు. ఇప్పటికే రూ. 21,000 తో ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మార్కెట్లో దీనికి టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కజార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అలాగే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు కూడా ఇది సవాలు విసరబోతోంది.
మహీంద్రా అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఈ కొత్త కారులో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాల నుంచి ముందస్తు హెచ్చరికలు అందుతాయి. విజువల్ డిస్‌ప్లేతో కూడిన సేఫ్టీ అలర్ట్స్, పవర్డ్ టెయిల్‌గేట్, పిక్సెల్ స్టైల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం, మోడరన్ లుక్‌ను ఇస్తున్నాయి. స్టైల్, సేఫ్టీ, టెక్నాలజీ కోరుకునే వారికి XUV 7XO ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

