Mahindra : మహీంద్రా మెగా ప్లాన్..నెలకు 7000 ఈవీలు అమ్మాలని టార్గెట్..కారణం ఇదే.

Mahindra : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మెగా ప్లాన్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, ప్రతి నెలా సుమారు 7,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల వాహనాలను డెలివరీ చేస్తున్న మహీంద్రా, ఇటీవల విడుదల చేసిన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9S ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చనే విశ్వాసంతో ఉంది. రాబోయే సంవత్సరాల్లో మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు 25% ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ డివిజన్ సీఈఓ రాజేష్ జేజురికర్ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ప్రజాదరణ వేగంగా పెరుగుతోందని, రాబోయే సంవత్సరంలో ఈ విభాగం కంపెనీకి కీలకం కానుందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 8,000 యూనిట్ల వరకు పెంచుతోంది. మహీంద్రా అంచనా ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2027-28 నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల సహకారం దాదాపు 25% వరకు చేరుకునే అవకాశం ఉంది.
చాకన్ ప్లాంట్‌లో తయారవుతున్న మహీంద్రా బార్న్-ఎలక్ట్రిక్ మోడల్స్, BE 6, XEV 9 మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. గత ఏడు నెలల్లో ఈ మోడల్స్ 30,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ.8,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఈ గణాంకాలు మహీంద్రా ఎలక్ట్రిక్ వ్యూహం విజయవంతమవుతున్నట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలతో పాటు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ పై కూడా మహీంద్రా దృష్టి పెట్టింది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఉపశమనం కలిగించడానికి, 2027 నాటికి ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో సుమారు 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎగుమతి విషయంలో మహీంద్రా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మొదట రైట్-హ్యాండ్-డ్రైవ్ మార్కెట్‌లకు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఎగుమతి చేసి, ఆ తర్వాత డిమాండ్, కస్టమర్ అభిప్రాయం ఆధారంగా లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ దేశాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. బ్యాటరీల పారవేత ఒక సవాలుగా మారుతున్నందున, మహీంద్రా ప్రత్యేకంగా బ్యాటరీ రీసైక్లింగ్‌పై దృష్టి సారించింది. దీనిపై కంపెనీ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగం మొదటగా పని చేయనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

