Nestle Layoff : నెస్లేలో భారీ కోత..కొత్త సీఈవో ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన.

Nestle Layoff : ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన నెస్లే భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధం అవుతుంది. ఇటీవల కంపెనీ బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కంపెనీని వేగంగా మార్చి, పూర్వ వైభవం తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఉద్యోగాల కోత నెస్లే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6% ఉంటుందని సీఈఓ నవ్రాటిల్ గురువారం ప్రకటించారు. ప్రపంచం మారుతోందని, నెస్లే కూడా మరింత వేగంగా అందుకు అనుగుణంగా మారాలని, అందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ తొలగింపు ప్రక్రియ రెండేళ్ల కాలంలో జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ కోతలు ప్రపంచవ్యాప్తంగా అమలు అవుతాయి.. అంటే నెస్లే పనిచేసే ప్రతి దేశంలో ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ తొలగింపులో ఇప్పటికే ఉత్పత్తి, సరఫరా గొలుసు విభాగాలలో తగ్గించిన 4,000 ఉద్యోగాలతో పాటు, అదనంగా 12,000 వైట్-కాలర్ ఉద్యోగుల కోత ఉంటుంది. మొత్తంగా రాబోయే కాలంలో కంపెనీ 16,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ చర్యల ద్వారా కంపెనీ గతంలో అనుకున్న మొత్తం కంటే రెట్టింపు, అంటే 1 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (సుమారు రూ.9,000 కోట్లు) ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ కంపెనీ తొమ్మిది నెలల గణాంకాలను విడుదల చేసినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంపెనీ అమ్మకాలు 1.9 శాతం తగ్గి 65.9 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకున్నాయి. అమ్మకాల వృద్ధి ఊహించినంత బలంగా లేకపోవడం ఆయనను కలవరపరిచింది. నవ్రాటిల్ 2001లో నెస్లేలో చేరి దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అతను ప్రకటనల ఖర్చును పెంచడం, తక్కువ పనితీరు కనబరుస్తున్న యూనిట్లను అమ్మడం వంటి వ్యూహాలను కొనసాగిస్తానని సూచించారు. ఈ కఠిన నిర్ణయాల కారణంగానే ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో నెస్లే షేర్లు 3.4% పెరిగాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com