EPFO : ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. 13 పాత రూల్స్ రద్దు.. పీఎఫ్ ఖాతాలో 100% డబ్బు విత్‌డ్రాకు అనుమతి.

EPFO : ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. 13 పాత రూల్స్ రద్దు.. పీఎఫ్ ఖాతాలో 100% డబ్బు విత్‌డ్రాకు అనుమతి.
X

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు భారీ శుభవార్త అందించింది. ఇకపై సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి లభించింది. సోమవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపీఎఫ్ఓ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులు పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభతరం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగుల సౌలభ్యం కోసంఈపీఎఫ్ఓ పాత, క్లిష్టమైన 13 విత్‌డ్రా నిబంధనలను రద్దు చేసింది. ఇకపై పీఎఫ్ డబ్బు విత్‌డ్రా కోసం కేవలం మూడు సులభ కేటగిరీలను మాత్రమే పాటించాల్సి ఉంటుంది. అవి: 1) అత్యవసర అవసరాలు (అనారోగ్యం, విద్య, పెళ్లి); 2) గృహ అవసరాలు (ఇల్లు/స్థలం కొనుగోలు, నిర్మాణం); 3) ప్రత్యేక పరిస్థితులు. ఈ మార్పుల ద్వారా పీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం లభించింది.

పీఎఫ్ డబ్బు విత్‌డ్రా పరిమితులలో ఈపీఎఫ్ఓ భారీ మార్పులు చేసింది. గతంలో విద్య, పెళ్లి వంటి అవసరాలకు కేవలం 3 సార్లు మాత్రమే డబ్బు తీసుకునేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్లు వరకు డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే, విత్‌డ్రా కోసం పాటించాల్సిన మినిమమ్ సర్వీస్ పీరియడ్ నిబంధనను కూడా తగ్గించి, అన్ని అవసరాల కోసం 12 నెలలకు పరిమితం చేశారు. గతంలో ఇది ఒక్కో అవసరానికి ఒక్కోలా ఉండేది.

ప్రత్యేక పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత సులభతరం చేసింది. ఇంతకుముందు సహజ విపత్తులు, నిరుద్యోగం, అంటువ్యాధులు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బు తీసుకునేటప్పుడు విత్‌డ్రాకు కచ్చితమైన కారణం చెప్పాల్సి వచ్చేది. దీనివల్ల చాలా క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. కానీ, ఇకపై ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ విత్‌డ్రా కోసం ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా ఆటోమేటిక్ చేసేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల క్లెయిమ్‌లు మరింత వేగంగా పరిష్కారమవుతాయి. అలాగే, సభ్యులు తమ ఖాతాలో కనీసం 25 శాతం నిధిని మినిమం బ్యాలెన్స్‌గా ఉంచాలని ఈపీఎఫ్ఓనిర్ధారించింది. దీనివల్ల సభ్యులకు 8.25% వడ్డీ రేటు, చక్రవడ్డీ ప్రయోజనాలు కొనసాగి, పదవీ విరమణ కోసం మంచి నిధి తయారవుతుంది.

Tags

Next Story