Make In India : మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్.. 10 ఏళ్లలో రెట్టింపైన విదేశీ పెట్టుబడులు.

Make In India : భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో ఈ పథకం దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చివేసిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కారణంగా గత 10 సంవత్సరాలలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే రెట్టింపు అయింది. ప్రస్తుతం దేశంలో ఏటా $70-80 బిలియన్ల విదేశీ పెట్టుబడులు వస్తుండగా, రాబోయే సంవత్సరాల్లో దానిని $100 బిలియన్లకు (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. గత 10 సంవత్సరాలలో (2014–2024) భారతదేశం మొత్తం $667.4 బిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది అంతకుముందు దశాబ్దం (2004–2014)లో వచ్చిన $304.1 బిలియన్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.
ప్రస్తుతం ఏటా $70 నుంచి $80 బిలియన్ల వరకు విదేశీ పెట్టుబడులు వస్తుండగా, రాబోయే సంవత్సరాల్లో దానిని కనీసం $100 బిలియన్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మేక్ ఇన్ ఇండియా కారణంగా దేశం తయారీ మౌలిక సదుపాయాలు, రక్షణ ఉత్పత్తి, ఎగుమతుల రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. తయారీ రంగంలోకి FDI ఈక్విటీ ప్రవాహం 69% పెరిగి $165 బిలియన్లకు చేరుకుంది.
ఆటోమొబైల్, టెలికాం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో అత్యధిక విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025) భారతదేశం $22.49 బిలియన్ల విదేశీ పెట్టుబడులని ఆకర్షించింది, ఇది గత సంవత్సరం కంటే 26% ఎక్కువ. ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (PLI) పథకం ద్వారా దేశంలో ఉద్యోగాల సృష్టి, ఉత్పత్తిలో భారీ పెరుగుదల కనిపించింది. PLI పథకం కింద 14 రంగాలలో జూన్ 2024 వరకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడి, రూ.10.9 లక్షల కోట్ల ఉత్పత్తి జరిగింది. దీని ద్వారా సుమారు 8.5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో దేశంలో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటింది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న మొబైల్ ఫోన్లలో 99% భారతదేశంలోనే తయారవుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించింది. మొబైల్ ఎగుమతులు రూ.1,556 కోట్ల నుంచి ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు (దాదాపు 7,500% పెరుగుదల) చేరుకున్నాయి. టెక్నాలజీలో కీలకమైన సెమీకండక్టర్ల రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో రూ.1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి వచ్చింది. ఐదు కొత్త సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్‌లు కలిసి ప్రతి రోజు 7 కోట్ల కంటే ఎక్కువ చిప్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

