New Launchs : మార్చిలో కార్ల జాతర.. క్రెటాకు పోటీగా స్కోడా కుషాక్, రెనాల్ట్ డస్టర్ సరికొత్త ఎంట్రీ.

New Launchs : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు రాజ్యమేలుతుండగా, వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త హంగులతో రెండు పవర్‌ఫుల్ కార్లు సిద్ధమయ్యాయి. 2026 మార్చి నెలలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, రెనాల్ట్ డస్టర్ థర్డ్ జనరేషన్ మోడళ్లు మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ రెండు కార్లు రాకతో కార్ల ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
స్కోడా కుషాక్ 2026 ఫేస్‌లిఫ్ట్
స్కోడా కుషాక్ కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ.15,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు. మార్చిలో దీని ధరలను అధికారికంగా ప్రకటించి, డెలివరీలను ప్రారంభించనున్నారు. ఈ కొత్త మోడల్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులు చేశారు. కొత్త హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్లు, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్ఈడీ లైట్ బార్ దీనికి సరికొత్త లుక్‌ను ఇస్తున్నాయి. లోపల కూడా పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెనుక సీట్లకు మసాజర్ సదుపాయం, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లను జోడించారు. ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో ఇప్పుడు అత్యాధునిక 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకువచ్చారు.
రెనాల్ట్ డస్టర్ 2026
ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ ట్రెండ్‌ను సెట్ చేసిన రెనాల్ట్ డస్టర్, ఇప్పుడు మూడవ జనరేషన్ మోడల్‌తో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఇది చూడటానికి మునుపటి కంటే చాలా మోడ్రన్‌గా, గంభీరంగా కనిపిస్తోంది. మొదటగా ఇది రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. అందులో ఒకటి 100bhp ఇచ్చే 1.0 లీటర్ ఇంజిన్ కాగా, రెండోది ఏకంగా 163bhp పవర్‌ను ఇచ్చే 1.3 లీటర్ ఇంజిన్. ఇక 2026 దీపావళి నాటికి దీని హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ఇది తన సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ వాహనంగా నిలవనుంది. లోపల డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
ఈ రెండు కార్లు మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఎదురవుతుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డస్టర్ హైబ్రిడ్ వెర్షన్, కుషాక్ కొత్త గేర్‌బాక్స్ టెక్నాలజీ కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
