Budget 2026 : బడ్జెట్ ఎఫెక్ట్.. పసిడి మార్కెట్‌లో ముందస్తుగా ప్రాఫిట్ బుకింగ్ మొదలైందా?

Budget 2026 : ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వెండి ధర కిలోకు దాదాపు రూ.90,000 వరకు పడిపోవడం మదుపర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. అటు బంగారం కూడా ఆల్‌టైమ్ హై నుంచి ఏకంగా రూ.16,000 మేర చౌకైంది. ఈ విపరీతమైన పతనానికి కారణాలేంటి? రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? కొత్తగా పెట్టుబడి పెట్టేవారు ఏం చేయాలి? ఈ అంశాలపై ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అందించిన వివరాలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 5,594 డాలర్ల నుంచి 5,149 డాలర్లకు పడిపోగా, వెండి 121 డాలర్ల నుంచి 108 డాలర్లకు దిగివచ్చింది. భారతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4.20 లక్షల నుంచి రూ.3.32 లక్షల స్థాయిని తాకింది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్ అని నిపుణులు విశ్లేషించారు. ఇప్పటివరకు భారీ లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు, డాలర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని గ్రహించి, ఒకేసారి తమ వాటాలను అమ్ముకున్నారు. దీనివల్ల మార్కెట్ లో డిమాండ్ తగ్గి ధరలు కుప్పకూలాయి.
వెండి ధరలు ఇంత వేగంగా పడిపోవడానికి కారణం అది పారిశ్రామిక అవసరాలతో ముడిపడి ఉండటమే. వెండి వాస్తవ విలువ 95 నుంచి 100 డాలర్ల మధ్య ఉండాలని, కానీ అది అనూహ్యంగా 121 డాలర్లకు పెరగడం వల్ల ఒక బబుల్ ఏర్పడిందని రాయ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ బబుల్ పేలిపోవడంతో ధరలు మళ్లీ వాస్తవ స్థాయికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టిన రిటైల్ మదుపర్లు భయాందోళనతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ధరలు మరింత పడిపోయే ప్రమాదం ఉంది.
పెట్టుబడి విషయానికి వస్తే.. బంగారం ఎప్పుడూ సురక్షితమైనదేనని నిపుణులు సూచించారు. బంగారం ఒకసారి గరిష్ట స్థాయిని తాకితే, కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయికి చేరుకుంటుంది. కానీ వెండిని డెవిల్స్ మెటల్ అని పిలుస్తారు. ఇది ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా పడిపోతుంది. అందుకే వెండిలో ఊహాజనిత ట్రేడింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వెండిలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొంతకాలం వేచి చూడటం ఉత్తమం. ధరలు స్థిరపడి, మళ్లీ పెరిగే సంకేతాలు కనిపించినప్పుడే కొంచెం కొంచెంగా కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 మార్కెట్ కదలికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్‌లో అస్థిరత ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద ట్రేడర్లు తమ డబ్బును మార్కెట్‌లో ఉంచకుండా నగదు రూపంలో తమ వద్దే పెట్టుకున్నారు. బడ్జెట్ తర్వాత వచ్చే పాలసీలను బట్టి మళ్లీ పెట్టుబడులు ప్రవహించే అవకాశం ఉంది. మదుపర్లు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో వెండికి 5 శాతం, బంగారానికి 15 శాతం మాత్రమే కేటాయించాలని, అంతేకానీ షేర్లు అమ్మి మరీ బంగారంపై పెట్టడం సరికాదని ఆయన హెచ్చరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
