Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లో యుద్ధ సెగ.. 5 సెకన్లలోనే రూ.5 లక్షల కోట్లు గోవిందా.

Stock Market Crash : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 5 సెకన్లలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోయాయి. మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దలాల్ స్ట్రీట్‌లో హాహాకారాలు మిన్నంటాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ప్రారంభంలోనే భారీ పతనాన్ని చవిచూసింది. బుధవారం ముగింపు స్థాయి 76,863.71 పాయింట్లతో పోలిస్తే, గురువారం ఏకంగా 494.06 పాయింట్ల నష్టంతో 76,369.65 వద్ద మొదలైంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ట్రేడింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే పతనం మరింత తీవ్రమైంది. ఉదయం 9:15 గంటల సమయానికి సెన్సెక్స్ 915.72 పాయింట్లు (1.19%) కోల్పోయి 75,947.99 కనిష్ట స్థాయికి పడిపోయింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో 23,674.85 వద్ద ప్రారంభమై, కొద్దిసేపటికే 264.85 పాయింట్లు (1.11%) దిగజారి 23,602.00 స్థాయికి చేరుకుంది. మార్కెట్‌లోని దాదాపు అన్ని రంగాలు ఎరుపు రంగులోకి మారిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 0.5% నుండి 1.7% వరకు పతనమయ్యాయి. మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, ఇడిగో, ఎల్ అండ్ టీ వంటి షేర్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణం కేవలం దేశీయ పరిస్థితులు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలే. ఆసియా మార్కెట్లన్నీ తీవ్ర బలహీనతను ఎదుర్కొంటున్నాయి. జపాన్ నెక్కి ఇండెక్స్ 848 పాయింట్లు (1.54%) పడిపోగా, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్, దక్షిణ కొరియా కోస్పి సూచీలు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతానికి కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
