Market Crash: 5 సెకన్లలో 9 లక్షల కోట్లా? ఇది మార్కెట్ పతనం కాదు.. అంతకు మించి!

Market Crash: 5 సెకన్లలో 9 లక్షల కోట్లా? ఇది మార్కెట్ పతనం కాదు.. అంతకు మించి!
X

Market Crash: వారమంతా కష్టపడి సంపాదించుకున్న ఇన్వెస్టర్ల సొమ్ము.. సోమవారం ఉదయం మార్కెట్ మొదలైన కేవలం 5 సెకన్లలోనే ఆవిరైపోయింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడటంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.9 లక్షల కోట్లను నష్టపోయారు. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్, నిఫ్టీలు పాతాళానికి పడిపోవడంతో మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు.

సోమవారం ఉదయం 9:21 గంటలకే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2,272 పాయింట్లు (2.87%) పడిపోయి 76,621 వద్ద ట్రేడ్ అయింది. అటు నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 706 పాయింట్లు (2.89%) నష్టపోయి 23,743 స్థాయికి పడిపోయింది. వాస్తవానికి ఈ పతనం శుక్రవారం నుంచే మొదలైంది. గత శుక్రవారం కూడా సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయాయి. కానీ, నేటి పతనం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రతి సెకనుకు కోట్లాది రూపాయల సంపద హరించుకుపోతుండటంతో అటు బ్రోకరేజ్ సంస్థలు, ఇటు సామాన్య ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్కెట్ విధ్వంసానికి ప్రధాన కారణం సముద్రాల అవతల జరుగుతున్న యుద్ధమే. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై దాడులు చేయగా, ప్రతిగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ లోని కీలక చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ ఏకంగా టెహ్రాన్ లోని ప్రధాన ఆయిల్ డిపోలను ధ్వంసం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ముప్పు ఏర్పడింది. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 117 డాలర్ల మార్కును దాటేసింది. చమురు ధరలు పెరగడం అంటే ద్రవ్యోల్బణం పెరగడమే అని మార్కెట్ భయపడుతోంది. ఒక్క భారత్ మాత్రమే కాదు, ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు కూడా 7 శాతం వరకు పతనాన్ని చవిచూశాయి.

ప్రస్తుతానికి మార్కెట్‌లో కేవలం అమ్మకాల ఒత్తిడి మాత్రమే కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు తొలగి, చమురు ధరలు అదుపులోకి వస్తే తప్ప మార్కెట్లు కోలుకునేలా లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటివరకు ఇన్వెస్టర్లు తొందరపడి కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని, పోర్ట్‌ఫోలియోను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాలో ఆటంకాలు కొనసాగితే అది రవాణా రంగం నుంచి నిత్యావసరాల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుంది. వెరసి, సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ కు ఒక బ్లాక్ మండేగా మిగిలిపోయింది.

Tags

Next Story