Maruti Fronx : కాలుష్యం తక్కువ..మైలేజీ ఎక్కువ.. మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ రెడీ.

Maruti Fronx : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఏడాది సంచలనానికి సిద్ధమైంది. తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‎లో సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను కంపెనీ త్వరలోనే పరిచయం చేయబోతోంది. సాధారణంగా కార్లు పెట్రోల్‌తో నడుస్తాయని మనకు తెలుసు, కానీ ఈ Maruti Fronx E85 FFV ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం 15% పెట్రోల్, ఏకంగా 85% ఇథనాల్‌ మిశ్రమంతో నడుస్తుంది. దీనివల్ల కారు రన్నింగ్ కాస్ట్ భారీగా తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసేలా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ఏడాదే ఈ వినూత్న ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

సాంకేతిక వివరాల్లోకి వెళితే.. కొత్త ఫ్రాంక్స్ E85 FFVలో మారుతికి చెందిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఉపయోగించనున్నారు. గతంలో వ్యాగన్-ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్‌లో చూపించిన ఇంజిన్ టెక్నాలజీనే దీనికి కూడా జోడించారు. ఈ ఇంజిన్ 85% ఇథనాల్ వాడకానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇథనాల్ వాడకం వల్ల ఇంజిన్ లోపల దహన ప్రక్రియ చాలా క్లీన్‌గా ఉంటుంది, దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా మైలేజీ కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే ఒకే ఇంజిన్ ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనాలతో నడవడం. ఈ టెక్నాలజీ ఉన్న కార్లలో పెట్రోల్, ఇథనాల్‌ను ఏ నిష్పత్తిలో కలిపినా ఇంజిన్ స్మూత్‌గా నడుస్తుంది. E85 ఇంధనం ఆక్టేన్ రేటింగ్ 100 నుంచి 110 మధ్యలో ఉంటుంది, ఇది సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువ. దీనివల్ల ఇంజిన్ పర్ఫార్మెన్స్ అదిరిపోవడమే కాకుండా, ఇంజిన్ లోపల భాగాలు త్వరగా అరిగిపోవు. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరకే లభించే ఇథనాల్‌తో కారు నడపడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది.

డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న ఫ్రాంక్స్‌కు దీనికి పెద్దగా తేడా ఉండదు. ముందు భాగంలో స్టైలిష్ వేవ్-స్టైల్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆకట్టుకునే అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. కారు వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనిని ఒక మోడ్రన్ ఎస్‌యూవీగా నిలబెడతాయి. ఇంటీరియర్‌లో కూడా డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అన్ని అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. మొత్తానికి మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు భారత రోడ్లపై ఒక కొత్త విప్లవానికి తెరలేపబోతోంది.

Tags

Next Story