Maruti : బ్రెజ్జా, గ్రాండ్ విటారా టాప్ గేర్..ఫిబ్రవరిలో ఏకంగా 2.13 లక్షల కార్ల విక్రయం..మారుతి సేల్స్ రికార్డ్.

Maruti : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఫిబ్రవరి 2026 నెలలో అదిరిపోయే సేల్స్ గణాంకాలతో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గతేడాది ఫిబ్రవరిలో 1,99,400 వాహనాలను విక్రయించిన ఈ సంస్థ, ఈ ఏడాది అదే నెలలో ఏకంగా 2,13,995 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి తన సత్తా చాటుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతి సుజుకి తన వ్యూహాలను మార్చుకుంటూ, కస్టమర్ల మనసు గెలవడంలో మరోసారి సక్సెస్ అయ్యింది. అయితే ఈ విక్రయాల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏమిటో అర్థం చేసుకోవాలంటే సెగ్మెంట్ వారీగా కంపెనీ ప్రదర్శనను నిశితంగా గమనించాలి.
ప్రస్తుతం మారుతి సుజుకి వృద్ధికి ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రధాన ఇంజిన్‌లా పనిచేస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన ఈ కంపెనీ, ఇప్పుడు ఎస్‌యూవీల మార్కెట్‌లోనూ పాగా వేసింది. మారుతి బ్రెజ్జా, అెర్టిగా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ కార్ ఈ-విటారా వంటి మోడళ్లు కలిపి ఫిబ్రవరిలో ఏకంగా 72,756 యూనిట్ల విక్రయాలను సాధించాయి. భారతీయ కస్టమర్లు ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీలు, పెద్ద ఫ్యామిలీ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, చిన్న వ్యాపారస్తుల ఆరాధ్య దైవంగా మారిన మారుతి ఈకో వ్యాన్ కూడా 11,620 యూనిట్లతో తన పట్టును నిలబెట్టుకుంది.
మారుతి సుజుకికి ఈ ఏడాది లభించిన మరో అతిపెద్ద విజయం ఎగుమతుల విభాగం నుంచి వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా మోడళ్లకు విదేశీ మార్కెట్లలో భలే గిరాకీ ఏర్పడింది. ఫిబ్రవరిలో కంపెనీ మొత్తం 39,155 కార్లను అంతర్జాతీయ మార్కెట్లకు పంపింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతుల్లో ఏకంగా 56 శాతం భారీ వృద్ధి నమోదు కావడం విశేషం. దీనివల్ల మారుతి సుజుకి కేవలం దేశీయ కంపెనీగానే కాకుండా గ్లోబల్ ప్లేయర్‌గా తన ముద్ర వేస్తోంది. దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు సుమారు 1,61,000 యూనిట్లుగా ఉండి, గత ఏడాదితో పోలిస్తే నిలకడగా కొనసాగుతున్నాయి.
అయితే ఎస్‌యూవీలు, ఎగుమతులు దూసుకుపోతుంటే, మారుతికి పెట్టని కోటగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్‌లో మాత్రం కొంత నెమ్మది కనిపిస్తోంది. ఒకప్పుడు మారుతికి వెన్నెముకగా నిలిచిన ఆల్టో, ఎస్-ప్రెసో, స్విఫ్ట్, బాలెనో వంటి ఎంట్రీ లెవల్, కాంపాక్ట్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. కస్టమర్ల ప్రాధాన్యతలు మెల్లగా మారుతున్నాయని, వారు మరింత సౌకర్యం, సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లు ఉన్న పెద్ద కార్ల కోసం చూస్తున్నారని ఈ మార్పు సూచిస్తోంది.
ఓవరాల్‌గా చూస్తే ఫిబ్రవరి 2026 ప్రదర్శన మారుతి సుజుకి కొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. చిన్న కార్ల తయారీదారు అనే ముద్రను చెరిపేసుకుని, ఎస్‌యూవీ మార్కెట్‌లో కింగ్‌గా ఎదిగేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వినూత్నమైన డిజైన్లు, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టడం, బలమైన ఎగుమతి వ్యూహం మారుతిని భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా నడిపిస్తున్నాయి. మార్చి నెలలో హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు పోటీగా మరిన్ని కొత్త ఎస్‌యూవీలు రాబోతుండటంతో ఆటో రంగంలో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
