Maruti Suzuki E-Vitara : మారుతి సుజుకి ఈ-విటారా ఇంకా ఆలస్యం..మార్కెట్‌లో టాటా, మహీంద్రా దెబ్బకు తట్టుకుంటుందా?

Maruti Suzuki E-Vitara : భారతదేశంలో కార్ల మార్కెట్‌కు రారాజుగా ఉన్న మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-విటారాను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ కారు ధర, ఖచ్చితమైన విడుదల తేదీ గురించి మాత్రం కంపెనీ ఇప్పటికీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మారుతి కార్లను ఇష్టపడే లక్షలాది మంది అభిమానులు ఈ కొత్త ఈవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ ఆలస్యం వారిలో కొంత నిరాశను కలిగిస్తోంది. మారుతి ఎప్పుడు లాంచ్ చేసినా, అప్పటికే మార్కెట్‌లో బలమైన పట్టు సాధించిన టాటా, మహీంద్రా, ఎంజీ వంటి కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఈ-విటారాను ఆటో ఎక్స్‌పో 2025 లో చూపించినా, కేవలం ఫీచర్లను మాత్రమే పదే పదే చూపించడంపై విమర్శలు వస్తున్నాయి. కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తెలుసుకోవాలని అనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారు ధర ఎంత? ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు? అని. ఈ కీలకమైన వివరాలను ప్రకటించకుండా లాంచ్‌లో ఆలస్యం చేయడం అనేది, ఈ కొత్త ఈవీ పై ఉన్న ఆసక్తిని, ఉత్సాహాన్ని తగ్గిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో మారుతికి ఈసారి గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే, మారుతి ఆలస్యంగా రంగంలోకి దిగుతుండగా, ఇప్పటికే దాని ప్రత్యర్థులు స్ట్రాంగ్ లైన్‌అప్‌ను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా టాటా మోటార్స్ ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సన్ ఈవీ, పంచ్ ఈవీ వంటి ఆరు ఈవీ మోడళ్లతో మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. మహీంద్రా కూడా XUV.e, BE సిరీస్‌లలో నాలుగు ఎలక్ట్రిక్ కార్లతో సిద్ధంగా ఉంది. అలాగే, ఎంజీ, హ్యుందాయ్ (క్రెటా ఎలక్ట్రిక్ తో సహా) కూడా తమ ఈవీ మోడళ్లను మార్కెట్‌లో బలంగా నిలబెట్టాయి. ఈ కంపెనీలన్నింటి పోటీని తట్టుకుని మారుతి నిలబడాలంటే, ఈ-విటారా ధర, క్వాలిటీ చాలా కీలకం కానున్నాయి.
ఇక మారుతి ఈ-విటారా సాంకేతిక అంశాలు, ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 61kWh సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అంచనా. ఈ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఫీచర్లలో భాగంగా 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫిక్స్‌డ్ గ్లాస్‌తో కూడిన సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే దీని ప్రారంభ ధర దాదాపు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సేఫ్టీ విషయంలో మారుతి ఈ-విటారా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఈవీలో లెవెల్ 2 ADASను అందిస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి 15కు పైగా ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. దీంతో పాటు అత్యవసర సమయాల్లో రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ వ్యూ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్ట వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఈ కారులో అందుబాటులో ఉండనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

