Maruti Suzuki : తొలి ఎలక్ట్రిక్ కారుతో మారుతి ఎంట్రీ.. ఈవిటారా లాంచ్ అయ్యేది అప్పుడే.

Maruti Suzuki : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. దీనికి మారుతి సుజుకి ఈవిటారా అని పేరు పెట్టారు. ఈ కారు డిసెంబర్ 2, 2025 న లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టాటా, మహీంద్రా, ఎంజీ వంటి కంపెనీలు ఈవీ విభాగంలో ఉన్నప్పటికీ, మారుతి ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం. మారుతి సుజుకి 2030 నాటికి దేశంలో 50% మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ రూ.70,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇందులో భాగంగానే ఈవీ హైబ్రిడ్ మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది.
మారుతి ఈవిటారాను పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రూపొందించారు. దీని ముందు భాగంలో 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRLలు, సన్నని LED హెడ్‌ల్యాంప్‌లు, క్లోజ్డ్ గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి దీనికి మోడ్రన్ ఎలక్ట్రిక్ లుక్‌ను ఇస్తాయి. క్యాబిన్ విషయానికి వస్తే ఇది ఇప్పటివరకు వచ్చిన మారుతి కార్లలోకెల్లా అత్యంత ప్రీమియంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్ సెటప్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్) ఉంటుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, గ్లాస్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇంటీరియర్‌ను మెరుగుపరుస్తాయి. ఇక బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, ఇందులో 61 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
మారుతి ఈవిటారా సేఫ్టీ విషయంలో భారీ అప్‌గ్రేడ్‌ను పొందింది. ఇది అడ్వాన్సుడ్ లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) తో వస్తుంది. ఇందులో లేన్-కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం అదనంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ హోల్డ్, 360-డిగ్రీ కెమెరా వంటి కీలక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్లు యువత, కుటుంబాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడేవారిని ఆకర్షించనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

