Maruti Suzuki : మారుతి సుజుకి మెగా రికార్డ్.. 9 నెలల్లోనే 17.46 లక్షల కార్ల విక్రయం.

Maruti Suzuki : మారుతి సుజుకి మెగా రికార్డ్.. 9 నెలల్లోనే 17.46 లక్షల కార్ల విక్రయం.
X

Maruti Suzuki : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. కస్టమర్లు కళ్లు మూసుకుని మారుతి కార్లను కొనేస్తుండటంతో అమ్మకాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా 17.46 లక్షల కార్లను విక్రయించి కంపెనీ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. భారతీయ రోడ్లపై మారుతి సుజుకి కార్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ జోరు మరింత పెరిగింది. మొదటి తొమ్మిది నెలల్లోనే మొత్తం 17,46,504 యూనిట్ల విక్రయాలను మారుతి నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు 16,29,631 యూనిట్లుగా ఉండేవి. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశీయ విక్రయాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే కార్ల సంఖ్య కూడా భారీగా పెరగడం విశేషం. ముఖ్యంగా బలెనో, జిమ్నీ మోడళ్లకు విదేశీ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.

అమ్మకాలు పెరగడంతో మారుతి సుజుకి ఆదాయం మరియు లాభాల్లోనూ రికార్డు వృద్ధి కనిపించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో కంపెనీ నికర అమ్మకాలు రూ.1,24,290 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇది రూ.1,06,258 కోట్లుగా ఉండేది. ఇక నికర లాభం కూడా రూ.10,440 కోట్ల నుండి రూ.10,854 కోట్లకు పెరిగింది. సుజుకి మోటార్ గుజరాత్ సంస్థను మారుతి సుజుకిలో విలీనం చేయడం వల్ల ఆపరేషన్ ఖర్చులు తగ్గి, పనితీరు మరింత మెరుగుపడిందని కంపెనీ తెలిపింది.

ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) మారుతి సుజుకి సరికొత్త శిఖరాలను అందుకుంది. ఈ మూడు నెలల కాలంలోనే 5.64 లక్షలకు పైగా కార్లను దేశీయంగా విక్రయించింది. దీనికి ప్రధాన కారణం ఎంట్రీ లెవల్ (ఆల్టో, ఎస్-ప్రెసో వంటివి) కార్లపై జీఎస్టీ కోత వల్ల ధరలు తగ్గడమే. తక్కువ ధరకే కారు వస్తుండటంతో సామాన్యులు కూడా మారుతి షోరూమ్‌ల వైపు క్యూ కట్టారు. దీనివల్ల మూడవ త్రైమాసికంలో సుమారు 68,000 అదనపు కార్లు అమ్ముడయ్యాయి.

ఎగుమతుల విషయానికి వస్తే, క్యూ3 లోనే లక్షకు పైగా కార్లను విదేశాలకు పంపించి మారుతి సత్తా చాటింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు కావాలి అనుకునే వారికి మారుతి సుజుకి ఎప్పుడూ మొదటి ఛాయిస్‌గా ఉంటోంది. బలమైన సర్వీస్ నెట్‌వర్క్, తక్కువ మెయింటెనెన్స్ మరియు మంచి రీసేల్ వాల్యూ ఉండటం మారుతికి అతిపెద్ద ప్లస్ పాయింట్లు. ఇదే ఊపు కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని మైలురాళ్లను మారుతి అధిగమించే అవకాశం ఉంది.

Tags

Next Story