Maruti Suzuki : మారుతి ఆల్టో రీ ఎంట్రీ అదిరింది.. జీఎస్టీ 2.0 దెబ్బకు సగానికి తగ్గిన ధరలు.

Maruti Suzuki : మారుతి ఆల్టో రీ ఎంట్రీ అదిరింది.. జీఎస్టీ 2.0 దెబ్బకు సగానికి తగ్గిన ధరలు.
X

Maruti Suzuki : ఒకప్పుడు మధ్యతరగతి భారతీయుల కలల కారుగా వెలిగిన మారుతి సుజుకి ఆల్టో, మళ్ళీ తన పాత వైభవాన్ని సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు తగ్గి డీలా పడ్డ మారుతి మినీ కార్ సెగ్మెంట్, ఇప్పుడు ఏకంగా డబుల్ ధమాకాతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో కార్ల ధరలు తగ్గడం, దానికి తోడు కంపెనీ ఇస్తున్న భారీ డిస్కౌంట్లు ఆల్టోను మళ్ళీ మార్కెట్ రారాజుగా నిలబెట్టాయి.

డిసెంబర్ 2025లో మారుతి సుజుకి తన మినీ కేటగిరీ (ఆల్టో K10, ఎస్-ప్రెస్సో) కార్ల అమ్మకాల్లో ఏకంగా 92 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 7,418 కార్లు అమ్ముడవ్వగా, ఈసారి ఆ సంఖ్య 14,225 యూనిట్లకు చేరింది. ఇందులో ఒక్క ఆల్టో K10 మోడలే 10,800 యూనిట్లు అమ్ముడై తన సత్తా చాటింది. నవంబర్ నెలతో పోలిస్తే కూడా 15 శాతం పెరుగుదల కనిపించింది. మారుతి మార్కెటింగ్ హెడ్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ, ఇంకా ఒకటిన్నర నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ (పెండింగ్ బుకింగ్స్) ఉందని వెల్లడించారు.

ఈ భారీ అమ్మకాల వెనుక అసలు రహస్యం ధర తగ్గడమే..జీఎస్టీ తగ్గడం వల్ల, కంపెనీ అదనంగా ఇస్తున్న ఆఫర్ల వల్ల ఆల్టో, ఎస్-ప్రెస్సో ధరలు ఏకంగా రూ.లక్ష వరకు తగ్గాయి. ప్రస్తుతం ఈ కార్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4 లక్షల కంటే కిందకు వచ్చాయి. మారుతి ఆల్టో K10 ప్రారంభ ధర ఇప్పుడు కేవలం రూ. 3.70 లక్షలు, మారుతి ఎస్-ప్రెస్సో ధర రూ. 3.50 లక్షల నుండే మొదలవుతోంది. తక్కువ ధరకు కారు వస్తుండటంతో సామాన్యులు మళ్ళీ షోరూమ్‌ల బాట పట్టారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, పల్లెటూళ్లలో ఈ కార్ల కోసం జనం క్యూ కడుతున్నారు.

మారుతి మినీ కార్లే కాకుండా కాంపాక్ట్ సెగ్మెంట్ (బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వాగన్ ఆర్) కూడా అదరగొట్టింది. 2025 సంవత్సరానికి గాను మారుతి డిజైర్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవగా, డిసెంబర్ నెలలో మాత్రం బాలెనో రికార్డు సృష్టించింది. ఒక్క డిసెంబర్‌లోనే బాలెనో 22,108 యూనిట్లు అమ్ముడై కంపెనీలో టాప్ సేలింగ్ కారుగా నిలిచింది. పండుగ సీజన్ ముగిసినా, కొత్త ట్యాక్స్ విధానం వల్ల కారు కొనడం చౌకగా మారడంతో 2026లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందని కంపెనీ భావిస్తోంది.

Tags

Next Story