Maruti Victorias : కియా సెల్టోస్‌కు పోటీగా మారుతి విక్టోరిస్.. ధర, ఫీచర్లు, సేఫ్టీలో ఏది బెస్ట్?

Maruti Victorias : కియా సెల్టోస్‌కు పోటీగా మారుతి విక్టోరిస్.. ధర, ఫీచర్లు, సేఫ్టీలో ఏది బెస్ట్?
X

Maruti Victorias : కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగింది. ఈ విభాగంలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి తన కొత్త మోడల్ విక్టోరిస్‎ను రంగంలోకి దించింది. విక్టోరిస్, సెల్టోస్.. రెండూ ఒకే విభాగంలో ఉన్నప్పటికీ, వాటి ధర, ఫీచర్లు, భద్రత పరంగా కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ డీల్ అని తెలుసుకోవడానికి, వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలు చూద్దాం.

ధర విషయానికి వస్తే, మారుతి సుజుకి విక్టోరిస్ దాదాపు అన్ని వేరియంట్లలోనూ కియా సెల్టోస్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. విక్టోరిస్ బేస్ వేరియంట్ సెల్టోస్ బేస్ వేరియంట్ కంటే సుమారు రూ.70,000 వరకు తక్కువ ధరతో అందుబాటులో ఉంది. మీడియంట్లలో కూడా విక్టోరిస్ పొదుపైన ఎంపికగా నిలుస్తుంది. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లలో ధరల వ్యత్యాసం స్వల్పంగా తగ్గుతుంది. ఉదాహరణకు, విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధర సుమారు రూ.20 లక్షల వరకు ఉంటే, సెల్టోస్ GTX+, X-Line వేరియంట్లు రూ.20.5 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ ప్రీమియం ధర బ్రాకెట్‌లో, కస్టమర్‌లు సాధారణంగా డిజైన్, లగ్జరీ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ సెల్టోస్ బలంగా ఉంది.

రెండు ఎస్‌యూవీలలోనూ మూడు చొప్పున ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటి టెక్నాలజీ మాత్రం భిన్నంగా ఉంది. మారుతి సుజుకి విక్టోరిస్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, మైలేజీపై దృష్టి పెడుతూ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG ఆప్షన్, అధిక మైలేజీనిచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందిస్తుంది. దీనికి విరుద్ధంగా, కియా సెల్టోస్ మరింత పవర్‌ఫుల్ అయిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను అందిస్తుంది. సెల్టోస్ ముఖ్యంగా పనితీరు, సాంప్రదాయ ఇంధన ఎంపికలకు ప్రాధాన్యత ఇస్తుంది, అయితే విక్టోరిస్ CNG, హైబ్రిడ్ AWD టెక్నాలజీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.

టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్ల విషయంలో రెండు కార్లూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. రెండు కార్లలోనూ 10.25-అంగుళాల డిస్‌ప్లే, టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్-కార్ ఫీచర్లు ఉమ్మడిగా ఉన్నాయి. అయితే, విక్టోరిస్ లో జెస్చర్-పవర్డ్ టెయిల్‌గేట్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఇన్ఫినిటీ డాల్బీ అట్మాస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సుజుకి కనెక్ట్ ద్వారా OTA అప్‌డేట్‌లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు, సెల్టోస్ లో డాష్‌బోర్డ్‌పై డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, GT/X-Line స్పోర్టీ కాస్మెటిక్ ప్యాకేజీలు ఉన్నాయి. విక్టోరిస్ కనెక్టివిటీ, కేబిన్ యాంబియన్స్ పై దృష్టి పెడితే, సెల్టోస్ మరింత ప్రీమియం, స్పోర్టీ అనుభూతిని అందిస్తుంది.

భద్రత విషయంలో మారుతి సుజుకి విక్టోరిస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. విక్టోరిస్‌కు భారత్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్ లభించింది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, 360° కెమెరా, HUD (హెడ్-అప్ డిస్‌ప్లే), భారతీయ రోడ్లకు అనుగుణంగా ట్యూన్ చేయబడిన లెవల్-2 ADASతో వస్తుంది. సెల్టోస్‌లో కూడా లెవల్-2 ADAS ఫీచర్లు ఉన్నప్పటికీ, అవి GTX+ వంటి ఖరీదైన వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. ముఖ్యంగా, 2020లో గ్లోబల్ NCAP ద్వారా సెల్టోస్‌కు 3-స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. దీనిని బట్టి చూస్తే, విక్టోరిస్ మెరుగైన భద్రత రేటింగ్‌తో పాటు ADAS వంటి ఫీచర్లను ఎక్కువ వేరియంట్లలో అందిస్తూ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

మారుతి సుజుకి విక్టోరిస్ సరసమైన ధర, ఎక్కువ సేఫ్టీ రేటింగ్, CNG/హైబ్రిడ్ వంటి ఫ్యూయెల్ కెపాసిటీ ఆప్షన్లను కోరుకునే వాళ్లకు వాల్యూ ఫర్ మనీ ఎంపిక. దీనికి విరుద్ధంగా, కియా సెల్టోస్ మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌లు, స్పోర్టీ డిజైన్, అత్యుత్తమ ప్రీమియం ఫీచర్లను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. కాబట్టి మీ ప్రాధాన్యత ధర, మైలేజీ, భద్రత అయితే విక్టోరిస్, పర్ఫామెన్స్, ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అయితే సెల్టోస్ బెస్ట్ ఆప్షన్లు.

Tags

Next Story