Maruti Suzuki : మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..సింగిల్ ఛార్జ్ పై 500కిమీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే.

Maruti Suzuki : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన మారుతి సుజుకి నుంచి తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ త్వరలో రాబోతోంది. మారుతి ఈ-విటారా పేరుతో వస్తున్న ఈ ఎస్‌యూవీని డిసెంబర్ 2025 నాటికి షోరూమ్‌లలో ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ 500 కి.మీ. కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందించడం ద్వారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రి వంటి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరనుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన eVX కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడిన ఈ కొత్త ఈ-విటారా పూర్తి వివరాలు, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-విటారాను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఖచ్చితమైన తేదీని ప్రకటించనప్పటికీ డిసెంబర్ 2025 నాటికి ఈ-విటారా షోరూమ్‌లలోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మారుతి eVX కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది.
మిడ్‌సైజ్ ఈవీ విభాగంలోకి వస్తున్న ఈ-విటారా.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి ఈ-విటారాను వినియోగదారులకు రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించాలని యోచిస్తోంది. ఈ కారు 49kWh, 61kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. చిన్న బ్యాటరీ (49kWh) ఇది 144bhp ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో జత చేయబడి, 189Nm టార్క్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ (61kWh) రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది - 2WD (174bhp), AWD (184bhp).
500 కి.మీ. కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని మారుతి సుజుకి ధృవీకరించింది. ఇది సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి గొప్ప ప్రయోజనం. ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌లో అదనంగా వెనుక-యాక్సిల్‌పై అమర్చబడిన 65bhp మోటారును ఉపయోగించారు. ఇది 184bhp పవర్, 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి ఈ-విటారాను కేవలం దేశీయ మార్కెట్ కోసమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ-విటారా ఉత్పత్తికి గుజరాత్‌లోని హన్స్‌ల్పూర్ ఉత్పాదక కర్మాగారం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
మారుతి ఇప్పటికే జర్మనీ, బ్రిటన్, నార్వే, ఫ్రాన్స్‌తో సహా 12 యూరోపియన్ దేశాలకు ఈ ఎస్‌యూవీని ఎగుమతి చేయడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు తన ఎగుమతులను విస్తరించాలని సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ-విటారా ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం ఉన్న మారుతి కార్ల కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో ఫ్యాబ్రిక్, లెదరెట్ అప్‌హోల్‌స్ట్రీ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఒక స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరొక స్క్రీన్ ఉంటుంది. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, USB పోర్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, త్రి-స్లాష్ LED DRLలు, ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

