TCS : టీసీఎస్‌లో భారీ తొలగింపులు.. 2 ఏళ్ల జీతంతో ఉద్యోగులకు వీడ్కోలు.

దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ అవసరాలకు సరిపోని, లేదా అవుట్ డేటెడ్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తోంది. అయితే, ఈ తొలగింపు కేవలం ఉద్యోగం తీసేయడమే కాదు, వారికి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జీతం ఇచ్చి, ఆర్థిక సహాయం అందిస్తూ సాదరంగా వీడ్కోలు చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న సమయంలో టీసీఎస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీ అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు అంతా ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల యుగం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల నైపుణ్యాలు పాతబడిపోతే, కంపెనీ ముందుకు సాగడం కష్టమవుతుంది. టీసీఎస్ రాబోయే సంవత్సరంలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఇది తమ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన నిర్ణయమని, కానీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని కంపెనీ సీఈఓ కే. కృతివాసన్ తెలిపారు.
ఈ తొలగింపు ప్రభావం ప్రధానంగా మూడు రకాల ఉద్యోగులపై ఉంది. చాలా నెలలుగా ఏ ప్రాజెక్టులోనూ లేని ఉద్యోగులు (కంపెనీ పరిభాషలో 'బెంచ్'పై ఉన్నవారు) ఉన్నారు. 8 నెలలకు పైగా పని లేకుండా ఉన్నవారికి 3 నెలల జీతం ఇచ్చి పంపిస్తున్నారు. 10 నుంచి 15 ఏళ్లుగా కంపెనీలో ఉండి, తమ నైపుణ్యాలు కంపెనీ అవసరాలకు సరిపోని వారికి సుమారు ఒకటిన్నర సంవత్సరం జీతాన్ని సెవరెన్స్ ప్యాకేజీగా ఇస్తున్నారు. 15 ఏళ్లకు పైగా కంపెనీలో పనిచేసి, కొత్త టెక్నాలజీలకు మారలేని సీనియర్ ఉద్యోగులకు ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల జీతం ఇచ్చి గౌరవప్రదంగా వీడ్కోలు చెబుతున్నారు. అయితే, కొన్ని అరుదైన సందర్భాలలో సీనియర్ ఉద్యోగులకు రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ కింద కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఇంకా ఉంది.
ఉద్యోగులను కేవలం తొలగించడం మాత్రమే కాకుండా, టీసీఎస్ వారికి సహాయం అందిస్తోంది. ఉద్యోగం కోల్పోయినవారు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అయ్యే జాబ్ సెర్చ్ ఏజెన్సీ ఫీజును మూడు నెలల పాటు కంపెనీయే భరిస్తోంది. జూనియర్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరింత ఎక్కువ కాలం అందిస్తున్నారు. ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల కోసం TCS Cares అనే కార్యక్రమం ద్వారా థెరపీ, కౌన్సెలింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది.
పదవీ విరమణ వయస్సు దగ్గర ఉన్న ఉద్యోగులకు కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికను ఇచ్చింది. ఈ ఆఫర్ కింద వారికి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలు (పదవీ విరమణ పింఛను, బీమా, ఇతర సదుపాయాలు) అందిస్తారు. అంతేకాకుండా, అదనంగా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జీతాన్ని కూడా ఇస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య ఈ తొలగింపు, సర్దుబాటు ప్రక్రియలు అధిక శాతం పూర్తయినట్లు సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com