Matter EV : ఛార్జింగ్ పెట్టగానే చల్లబడే టెక్నాలజీ..మ్యాటర్ బైక్ కొంటే బ్యాటరీ టెన్షన్ తీరినట్టే.

Matter EV : ఛార్జింగ్ పెట్టగానే చల్లబడే టెక్నాలజీ..మ్యాటర్ బైక్ కొంటే బ్యాటరీ టెన్షన్ తీరినట్టే.
X

Matter EV : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మ్యాటర్ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఈవీ వాహనాల్లో అత్యంత కీలకమైన బ్యాటరీ పనితీరును మెరుగుపరిచేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ అయాంట్రాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా మ్యాటర్ తన ఎలక్ట్రిక్ బైక్‌లలో అడ్వాన్స్డ్ బ్యాటరీ సెన్సింగ్, అడాప్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇకపై మీ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఒక మెదడు ఉంటుంది. అది తన ఆరోగ్యాన్ని తనే చూసుకుంటూ, అవసరానికి తగ్గట్టుగా ఛార్జింగ్‌ను మార్చుకుంటుంది.

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఎంత శాతం ఉందో అంచనా వేస్తారు. కానీ, మ్యాటర్ తీసుకురాబోతున్న ఈ కొత్త సిస్టమ్‌లో బ్యాటరీ తన రియల్ టైమ్ కండిషన్‌ను తనే మానిటర్ చేసుకుంటుంది. బ్యాటరీ వేడెక్కినప్పుడు లేదా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, దానికి తగ్గట్టుగా ఛార్జింగ్ స్పీడ్‌ను ఈ సిస్టమ్ అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీపై థర్మల్ ఒత్తిడి తగ్గి, పేలిపోయే ప్రమాదాలు తప్పుతాయి. అంతేకాకుండా, బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా, పర్ఫార్మెన్స్ కూడా కాలక్రమేణా తగ్గకుండా ఉంటుంది. ఇది మ్యాటర్ AI-Defined Vehicle లాట్‌ఫారమ్‌లో ఒక భాగం కానుంది.

మ్యాటర్ కంపెనీ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్ ప్లాట్‌ఫారమ్‌పై తన వాహనాలను రూపొందిస్తోంది. ఇప్పుడు అయాంట్రా టెక్నాలజీ తోడవడంతో, ఈ బైకులు కేవలం బ్యాటరీని కాపాడటమే కాకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డేటాను విశ్లేషించి ఛార్జింగ్ ప్రొఫైల్‌ను మార్చుకోగలవు. ఫిక్స్‌డ్ ఛార్జింగ్ పద్ధతుల నుంచి బయటకు వచ్చి, బ్యాటరీ వాడకాన్ని బట్టి తెలివిగా పనిచేసే 'స్మార్ట్ ఎనర్జీ సిస్టమ్' దిశగా భారత్ నుంచి ఇది ఒక గొప్ప అడుగు.

ఈ సందర్భంగా మ్యాటర్ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ సీఈఓ మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. "భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కేవలం బ్యాటరీతో నడిచేవి మాత్రమే కాదు, అవి ఎంత తెలివైనవి అనేదే ముఖ్యం" అని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా మ్యాటర్ బైకులు వినియోగదారులకు మరింత భద్రతను, నాణ్యమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోటార్, థర్మల్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒకే తాటిపై పనిచేసేలా ఈ ఏఐ ఫ్రేమ్‌వర్క్ సహాయపడుతుంది.

Tags

Next Story