Meesho : మీషో ఐపీఓ దెబ్బ.. ఒక్క రోజులోనే బిలియనీర్ అయిన కో-ఫౌండర్ విదిత్ ఆత్రే.

Meesho : మీషో ఐపీఓ దెబ్బ.. ఒక్క రోజులోనే బిలియనీర్ అయిన కో-ఫౌండర్ విదిత్ ఆత్రే.
X

Meesho : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ మీషో ఐపీఓ లిస్టింగ్ రోజున కంపెనీ కో-ఫౌండర్, సీఈఓ అయిన విదిత్ ఆత్రే బిలియనీర్ల క్లబ్‌లో చేరిపోయారు. ఐపీఓ లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లలో ఏకంగా 74 శాతం భారీ వృద్ధి నమోదైంది. ఇష్యూ ధర రూ.111 ఉండగా, షేరు ధర రూ.193కు చేరింది. ఈ అనూహ్య పెరుగుదలతో విదిత్ ఆత్రే నికర విలువ అమాంతం ఒక బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.9,128 కోట్లు) చేరుకుంది. ఆత్రే వద్ద కంపెనీలో 11.1 శాతం వాటా (47.25 కోట్ల షేర్లు) ఉంది.

విదిత్ ఆత్రేతో పాటు, మీషో కంపెనీ కో ఫౌండర్ సంజీవ్ బర్న్‌వాల్ కూడా భారీ లాభాలను ఆర్జించారు. సంజీవ్ బర్న్‌వాల్ వద్ద కంపెనీలో 31.6 కోట్ల షేర్లు ఉన్నాయి. ఐపీఓ లిస్టింగ్ తర్వాత పెరిగిన ధరల ప్రకారం, ఆయన వాటా విలువ సుమారు రూ.6,099 కోట్లుగా అంచనా వేశారు. 2015లో విదిత్ ఆత్రే, సంజీవ్ బర్న్‌వాల్ కలిసి మీషోను స్థాపించారు. నేడు ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్ చిన్న వ్యాపారులకు, రిసెల్లర్ల నెట్‌వర్క్ ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

మీషో కంపెనీలో మెటా, సాఫ్ట్‌బ్యాంక్, సీక్వోయా క్యాపిటల్, వై కాంబినేటర్, నాస్‌పర్స్, ఎలివేషన్ క్యాపిటల్ వంటి ప్రపంచంలోని దిగ్గజ పెట్టుబడి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అందుకే ఇటీవలి సంవత్సరాలలో మీషో డిజిటల్ కామర్స్ రంగంలో అత్యంత చర్చనీయాంశమైన కంపెనీల్లో ఒకటిగా మారింది.

విదిత్ ఆత్రే మీషోలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కంపెనీ వ్యూహాలు, ముఖ్యమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక వృద్ధి దిశను ఆత్రేనే నిర్ణయిస్తారు. మీషో స్థాపించకముందు ఆయన ఐటీసీ లిమిటెడ్, ఇన్మోబి వంటి సంస్థల్లో పనిచేశారు. ఆయన విజయాన్ని ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30, ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 (2018), ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 (2021, 2024, 2025) వంటి అనేక ప్రముఖ అంతర్జాతీయ వేదికలు గుర్తించాయి.

మీషో సంస్థ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మొదట్లో ఈ కంపెనీని ఫ్యాష్‌నియర్ అనే పేరుతో ప్రారంభించారు. అది ఒక హైపర్‌లోకల్ ఫ్యాషన్ డెలివరీ యాప్. ఫ్లిప్‌కార్ట్ తొలి మోడల్‌ను అనుకరిస్తూ దీన్ని ప్రారంభించినా, అది త్వరగా ఫెయిల్ అయింది. ఎందుకంటే కస్టమర్లు డెలివరీ వేగం కంటే, ఎక్కువ రకాల ఉత్పత్తులు ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వారు షాపిఫై తరహా డిజిటల్ స్టోర్‌ఫ్రంట్‌ను రూపొందించారు. అది మెరుగ్గా ఉన్నా, పెద్ద స్థాయిలో వృద్ధి చెందలేదు. చివరకు రిసెల్లర్ల ద్వారా సోషల్ కామర్స్ విధానాన్ని అవలంబించిన తర్వాతే మీషో ఈ స్థాయి విజయాన్ని సాధించింది.

Tags

Next Story