Mercedes-Benz : G-క్లాస్ లో డీజిల్ ఇంజిన్ రీ-ఎంట్రీ.. G 450d లాంచ్ చేసిన మెర్సిడెస్-బెంజ్ ఇండియా.

Mercedes-Benz : G-క్లాస్ లో డీజిల్ ఇంజిన్ రీ-ఎంట్రీ.. G 450d లాంచ్ చేసిన మెర్సిడెస్-బెంజ్ ఇండియా.
X

Mercedes-Benz : లగ్జరీ కార్ల తయారీలో పేరుగాంచిన మెర్సిడెస్-బెంజ్, తమ పాపులర్ G-క్లాస్ కార్ల విభాగంలో కొత్త డీజిల్ వేరియంట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అదే G 450d. ఈ సరికొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.90 కోట్లు. ఈ కొత్త G 450d, ఇప్పటికే ఉన్న పెట్రోల్, ఎలక్ట్రిక్ G-క్లాస్ మోడళ్లకు ఒక పవర్ఫుల్ డీజిల్ ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

G 450d లో 3.0-లీటర్ ఇన్‌లైన్-సిక్స్ డీజిల్ ఇంజిన్‌ను 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కలిపి ఇచ్చారు. ఇది ఏకంగా 362 బీహెచ్‌పీ పవర్, 750 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, డీజిల్ ఎస్‌యూవీలలో ఇది మెర్సిడెస్-బెంజ్ నుంచి వచ్చిన అత్యంత పవర్ఫుల్ మోడల్. ఈ పవర్ కారణంగా, కేవలం 5.8 సెకన్లలోనే ఈ భారీ కారు 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అలాగే, మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ఇంధనాన్ని ఆదా చేయడంలో, వేగంగా పికప్ (థ్రాటిల్ రెస్పాన్స్) అవ్వడంలో సహాయపడుతుంది.

G-క్లాస్ అంటేనే ఎటువంటి దారుల్లో అయినా వెళ్లగలిగే సామర్థ్యం. G 450d ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. కారు కింది భాగం నేలను తాకకుండా ఉండటానికి 241 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే, 70 సెం.మీ లోతున్న నీటిలో కూడా సులభంగా దూసుకుపోగలదు. అతిపెద్ద వాలులను కూడా ఎక్కగలిగే 100% గ్రేడబిలిటీ కెపాసిటీ దీని సొంతం. అంతేకాక, ఇందులో G-క్లాస్‌కు ప్రత్యేకమైన మూడు డిఫరెన్షియల్ లాక్‌లు, స్ట్రాంగ్ ఆఫ్-రోడ్ సెటప్‌ను అందించారు.

G 450d తన పాత, క్లాసిక్ G-వ్యాగన్ డిజైన్‌ను పదిలపరుచుకుంది. అయితే, కారు గాలిలో మరింత వేగంగా, సైలెంటుగా వెళ్లడానికి వీలుగా కొన్ని చిన్న మార్పులు చేశారు. కొత్త ఫ్రంట్ బంపర్, A-పిల్లర్ దగ్గర మెరుగుదలలు, రూఫ్ పై భాగంలో చిన్న స్పాయిలర్ లిప్‌ను జోడించారు. ఈ SUVలో ఆకర్షణీయమైన 20-అంగుళాల బ్లాక్ ఏఎమ్‌జీ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇవి కాకుండా అత్యాధునిక డ్రైవింగ్ అసిస్టెన్స్ టెక్నాలజీని కూడా ఇందులో చేర్చారు.

Tags

Next Story