Mercedes-Benz : సింగిల్ ఛార్జ్‌తో 630కి.మీ..మెర్సిడెస్-బెంజ్ నుంచి కొత్త GLB ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

Mercedes-Benz : ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తమ కొత్త జనరేషన్ GLB కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ మొదటగా ఈ మోడల్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీని హైబ్రిడ్ మోడళ్లు తర్వాత రానున్నాయి. కొత్త GLB, పాత EQB మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ లేఅవుట్‌లలో లభిస్తుంది. ప్రారంభంలో రెండు ఎలక్ట్రిక్ వేరియంట్లు విడుదలయ్యాయి. ఇవి అద్భుతమైన పవర్, రేంజ్‌తో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్నాయి.
ప్రారంభ ఎలక్ట్రిక్ వేరియంట్ GLB 250+లో EQ టెక్నాలజీతో కూడిన వెనుక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 268 hp పవర్, 334 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 85 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 800-వోల్ట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ కేవలం 7.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 630 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు. దీనికంటే పవర్ఫుల్ మోడల్ GLB 350 4Matic. దీనిలో ముందు చక్రాలకు కూడా మోటార్ ఇవ్వడంతో ఇది ఆల్-వీల్ డ్రైవ్‌గా మారింది. దీని మొత్తం పవర్ 349 hp, టార్క్ 515 Nm. ఇది కేవలం 5.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. దాదాపు 614 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది.
ఈ రెండు ఎలక్ట్రిక్ మోడళ్లు 320 kW వరకు అల్ట్రా-ఫాస్ట్ డీసీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లో 260 కి.మీ.ల వరకు ప్రయాణించే రేంజ్‌ను పొందవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే క్యాబిన్‌లో పెద్ద స్క్రీన్ సెటప్ ఉంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14 అంగుళాల సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 14 అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్తో కూడిన ఆప్షనల్ సూపర్‌స్క్రీన్ లభిస్తుంది. మెర్సిడెస్ కొత్త నాలుగో జనరేషన్ MBUX సిస్టమ్ ఇందులో ఉంది, దీనిలో AI వర్చువల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ కొత్త GLBలో వీల్‌బేస్‌ను 60 ఎంఎం పెంచడం వల్ల పాత మోడళ్ల కంటే ఎక్కువ స్థలం లభిస్తుంది. 7-సీటర్ వేరియంట్‌లో స్లైడింగ్ సెకండ్ రో, ఐదు పిల్లల సీట్లను అమర్చే సౌకర్యం కూడా ఉంది.
ఈ కారు బూట్ స్పేస్ 5-సీటర్‌లో 540 లీటర్లు, 7-సీటర్‌లో మూడో వరుస సీట్లు మడతపెడితే 480 లీటర్లు ఉంటుంది. అదనంగా 127 లీటర్ల ఫ్రంట్ ట్రంక్ కూడా లభిస్తుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్ అనేది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్. జర్మనీలో GLB 250+ ధర €59,048 (సుమారు రూ.61 లక్షలు), GLB 350 4Matic ధర €62,178 (సుమారు రూ.65 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. మెర్సిడెస్ ఇంకా ఈ కొత్త GLBను భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో ప్రకటించలేదు. ప్రస్తుతం భారత మార్కెట్లో పాత EQB మోడల్ రూ.72 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

