MG Majestor : చూపు తిప్పుకోనివ్వని రూపం.. ఊపిరి బిగబట్టించే వేగం.. ఫార్చ్యూనర్ కోట ఇక బద్దలే

MG Majestor : చూపు తిప్పుకోనివ్వని రూపం.. ఊపిరి బిగబట్టించే వేగం.. ఫార్చ్యూనర్ కోట ఇక బద్దలే
X

MG Majestor : ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంజీ మెజస్టర్‎ను భారత మార్కెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న ఎంజీ గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన ఈ త్రీ-రో లగ్జరీ ఎస్‌యూవీ, అటు విలాసవంతమైన ఫీచర్లను, ఇటు శక్తివంతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను తనలో నింపుకుంది. ఇప్పటికే ఈ కారు ప్రీ-బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభం కాగా, ఏప్రిల్ 2026లో దీనిని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మే 2026 నుంచి కస్టమర్లకు వాహనాల డెలివరీ మొదలవుతుందని కంపెనీ ప్రకటించింది.

ఈ విభాగంలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్‎కు మెజస్టర్ నేరుగా సవాల్ విసురుతోంది. ఈ రెండు కార్ల మధ్య ప్రధాన వ్యత్యాసాలను గమనిస్తే, సైజు పరంగా మెజస్టర్ స్పష్టమైన పైచేయి సాధించింది. టయోటా ఫార్చ్యూనర్ కంటే ఇది 251 మిమీ ఎక్కువ పొడవు, 161 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉండటమే కాకుండా, 41 మిమీ ఎక్కువ ఎత్తుతో రోడ్డుపై అత్యంత భారీగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీని వీల్‌బేస్ ఫార్చ్యూనర్ కంటే 205 మిమీ ఎక్కువగా ఉండటం వల్ల కారు లోపల ప్రయాణికులకు విశాలమైన లెగ్‌రూమ్ లభిస్తుంది.

ఇక ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, ఎంజీ మెజస్టర్‌లో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 215-218 bhp పవర్‌ను, 478-480 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. దీనికి భిన్నంగా టయోటా ఫార్చ్యూనర్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 201 bhp పవర్‌ను ఉత్పత్తి చేసినప్పటికీ, టార్క్ విషయంలో మాత్రం 500 Nm (ఆటోమేటిక్ వెర్షన్) తో స్వల్పంగా మెజస్టర్ కంటే ముందుంది.

సేఫ్టీ, టెక్నాలజీ పరంగా చూస్తే, ఎంజీ మెజస్టర్ పూర్తి ఆధునిక హంగులతో నిండిపోయింది. ఇందులో Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను అందించారు. ఇది లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేస్తుంది. మరోవైపు టయోటా ఫార్చ్యూనర్ తన మన్నికకు, 7 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. అయితే ఆఫ్-రోడ్ ప్రియుల కోసం మెజస్టర్‌లో ప్రత్యేకంగా 10 డ్రైవ్ మోడ్స్, సెగ్మెంట్లోనే మొదటిసారిగా ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ ఫీచర్‌ను జతచేయడం గమనార్హం. మొత్తానికి పాతతరం మన్నికను కోరుకునే వారు ఫార్చ్యూనర్ వైపు మొగ్గు చూపుతుంటే, కొత్తతరం టెక్నాలజీ, భారీ సైజును ఇష్టపడే వారు ఎంజీ మెజస్టర్ వైపు చూస్తున్నారు.

Tags

Next Story