Stock Market Crash : బడ్జెట్ అంటేనే బెంబేలెత్తుతున్న మార్కెట్..15 సార్లలో 8 సార్లు ఇన్వెస్టర్ల జేబులు ఖాళీనే.

Stock Market Crash : మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 15 బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా, స్టాక్ మార్కెట్ చరిత్రను గమనిస్తే ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలే ఎక్కువగా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపు వంటి నిర్ణయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడమే కాకుండా, ఒక్కరోజే ఏకంగా రూ.9.40 లక్షల కోట్లు గాలిలో కలిసిపోయాయి. గత 15 బడ్జెట్‌లలో 8 సార్లు మార్కెట్లు నష్టాల్లోనే ముగియడం గమనార్హం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 బడ్జెట్‌లను (రెండు మధ్యంతర బడ్జెట్‌లతో కలిపి) పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ 15 ఏళ్లలో మార్కెట్ ప్రతిస్పందనను గమనిస్తే, ఇన్వెస్టర్లకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మిగిలాయి. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్లను కుదిపేసింది. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఫలితంగా సెన్సెక్స్ ఒకానొక దశలో 2,370 పాయింట్లు పతనమై 80 వేల దిగువకు పడిపోయింది. చివరికి 1,546 పాయింట్ల నష్టంతో 80,722 వద్ద ముగిసింది.
గత చరిత్రను తిరగేస్తే.. 2024 మధ్యంతర బడ్జెట్ రోజున కూడా మార్కెట్ 1.14 శాతం పడిపోయింది. అంతకుముందు 2020లో బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి సెన్సెక్స్ 2.42 శాతం నష్టపోయింది. 2018లో 0.16 శాతం, 2014లో 0.28 శాతం చొప్పున మార్కెట్లు నష్టపోయాయి. అయితే, 2021లో మాత్రం బడ్జెట్ ఇన్వెస్టర్లకు పండగను తీసుకొచ్చింది. ఆ ఏడాది ఏకంగా 5 శాతం మార్కెట్ పెరగడం విశేషం. 2022లో కూడా 1.46 శాతం పెరుగుదల నమోదైంది. కానీ ఓవరాల్ గా చూస్తే, మోదీ ప్రభుత్వ బడ్జెట్ రోజున మార్కెట్లు 8 సార్లు నష్టాల్లోనే ముగిశాయి.
రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్ కేవలం బడ్జెట్ వల్ల మాత్రమే కాకుండా అంతర్జాతీయ అనిశ్చితి వల్ల కూడా పడిపోతోంది. ముఖ్యంగా భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే వరకు మార్కెట్లలో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. అప్పటి వరకు సెన్సెక్స్ 80,000 నుంచి 82,500 మధ్య ఊగిసలాడే అవకాశం ఉందని సమాచారం. అంటే ఇన్వెస్టర్లు ఇప్పుడప్పుడే భారీ లాభాలను ఆశించడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
