MORGAN REPORT: అంతర్జాతీయ సెగల్లోనూ.. భారత్‌ వైపే 'మోర్గాన్‌' చూపు!

MORGAN REPORT: అంతర్జాతీయ సెగల్లోనూ.. భారత్‌ వైపే మోర్గాన్‌ చూపు!
X
2027 నాటికి సెన్సెక్స్ 89,000: మోర్గాన్ స్టాన్లీ... బుల్ రన్‌లో లక్ష మార్క్ తాకొచ్చు: మోర్గాన్ స్టాన్లీ

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు రాజ్యమేలుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, ముడిచమురు ధరల సెగలు దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రతికూలతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు బేరిష్ ధోరణిలోకి వెళ్తాయని పలు అంతర్జాతీయ బ్రోకరేజీలు అప్రమత్తత ప్రకటిస్తుంటే.. ప్రముఖ అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’ మాత్రం పూర్తి భిన్నంగా, అత్యంత సానుకూలంగా స్పందించింది. రాబోయే 12 నెలల్లో (2027 జూన్ నాటికి) బీఎస్ఈ సెన్సెక్స్ 89,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని బలంగా అంచనా వేసింది.

మూడు విభిన్న కోణాలు (సినారియోలు):

ప్రస్తుతం సెన్సెక్స్ 74,600 పాయింట్ల పరిసరాల్లో కదలాడుతుండగా, మోర్గాన్ స్టాన్లీ మార్కెట్ గమనాన్ని మూడు రకాలుగా విశ్లేషించింది:

సాధారణ అంచనా (బేస్ కేస్): సాంకేతిక బలాలు, విధానపరమైన సానుకూలతలతో రాబోయే ఏడాదిలో సెన్సెక్స్ 89,000 పాయింట్లకు చేరుకుంటుంది. ఈ అంచనా నిజమవడానికి 50% సంభావ్యత ఉంది.

బుల్ రన్ (అత్యంత సానుకూలం): ఒకవేళ అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల లోపుకు తగ్గి, దేశీయంగా పరిస్థితులు మరింత మెరుగైతే సెన్సెక్స్ ఏకంగా 1,00,000 (లక్ష) పాయింట్ల మైలురాయిని తాకవచ్చు.

బేర్ పట్టు (ప్రతికూలం): ముడిచమురు అధిక ధరలు సుదీర్ఘకాలం ఇలాగే కొనసాగితే మాత్రం మార్కెట్ ఒత్తిడికి లోనై సెన్సెక్స్ 66,000 పాయింట్లకే పరిమితం కావచ్చు.

మన మార్కెట్లలో ఏం కనిపించింది?

భారత్‌ను ఒక ‘డిఫెన్సివ్ గ్రోత్ మార్కెట్’గా మోర్గాన్ స్టాన్లీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ అభివర్ణించారు. అంతర్జాతీయ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడే సత్తా భారత్‌కు ఉందని చెప్పడానికి ప్రధాన కారణాలు:

కార్పొరేట్ రికవరీ: గత ఆరు త్రైమాసికాలుగా ఉన్న మందగమనం వీడి, కంపెనీల ఆర్థిక ఫలితాలు పుంజుకునే సంకేతాలు ఉన్నాయి.

కీలక రంగాల్లో పెట్టుబడులు: ఇంధనం, రక్షణ, సెమికండక్టర్లు, ఎరువులు, డేటా సెంటర్లు వంటి రంగాల్లో భారీగా వస్తున్న మూలధన పెట్టుబడులు (CapEx) మార్కెట్‌కు ఊతాన్నిస్తున్నాయి.

విధానపరమైన మద్దతు: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు, బ్యాంక్ డీరెగ్యులేషన్, మార్కెట్లోకి ద్రవ్యలభ్యత పెంపు, పన్ను కోతలు కంపెనీల లాభదాయకతను పెంచనున్నాయి.

అంతేకాకుండా, 2009 నుండి గ్లోబల్ ఇండెక్స్ వెయిటేజీతో పోలిస్తే అంతర్జాతీయ లాభాల్లో భారత్ వాటా ఎప్పుడూ పైచేయిగానే ఉండడం విశేషం.

ఏఐ సవాళ్లు ఉన్నా.. దేశీయ వృద్ధి పక్కా!

భారత మార్కెట్లకు సవాళ్లు ఎదురైతే అవి దేశీయంగా కంటే, అంతర్జాతీయ కారణాల వల్లే వస్తాయని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా భారత ఐటీ సేవల ఎగుమతులపై ప్రభావం పడే ముప్పు ఉంది. అయినప్పటికీ, రాబోయే దశాబ్దంలో దేశ జీడీపీలో తయారీ రంగం వాటా పెరగనుండడం, యువ జనాభా, పెరుగుతున్న వినియోగదారులు, ఆదాయ వృద్ధి దేశానికి రక్షణగా నిలవనున్నాయి.

Tags

Next Story