Reliance : రిలయన్స్ సంచలనం.. క్యాంపా ష్యూర్‎తో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లోకి అంబానీ

Reliance : రిలయన్స్ సంచలనం.. క్యాంపా ష్యూర్‎తో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లోకి అంబానీ
X

Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. రూ. 30,000 కోట్ల విలువైన దేశీయ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రవేశిస్తోంది. కొత్తగా క్యాంపా ష్యూర్ పేరుతో అతి తక్కువ ధరకే మినరల్ వాటర్‌ను అందిస్తూ, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న దిగ్గజ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. గతంలో క్యాంపా కోలాతో శీతల పానీయాల మార్కెట్‌లో ధరల యుద్ధాన్ని సృష్టించిన రిలయన్స్, ఇప్పుడు అదే వ్యూహాన్ని వాటర్ బిజినెస్‌లోనూ అమలు చేయబోతోంది.

క్యాంపా ష్యూర్ బ్రాండ్‌తో రిలయన్స్ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లో భారీ కలకలం సృష్టించబోతోంది. ఈ బ్రాండ్ స్పెషాలిటీ దాని తక్కువ ధర. సాధారణంగా ఇతర కంపెనీల 1 లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు రూ.20 ఉండగా, క్యాంపా ష్యూర్ దానిని కేవలం రూ.15 కే విక్రయించనుంది. అలాగే, 2 లీటర్ల బాటిల్‌ను కేవలం రూ.25 కే అందించనుంది, ఇది ఇతర బ్రాండ్‌ల కంటే 20-30% తక్కువ.

ఈ బ్రాండ్ 250 మిల్లీలీటర్ల చిన్న బాటిల్ నుంచి పెద్ద ప్యాక్‌ల వరకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, అతి చిన్న బాటిల్ ధర కేవలం రూ.5 మాత్రమే ఉండటం మార్కెట్‌లోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రిలయన్స్ ఈ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఒక వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. మార్కెట్‌లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడానికి బదులుగా, దేశంలోని స్థానిక, ప్రాంతీయ వాటర్ బాట్లింగ్ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ ఒక రిపోర్ట్‌లో మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే దాదాపు రెండు డజన్ల కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్యాల ద్వారా బాట్లింగ్, టెక్నాలజీ, బ్రాండింగ్‌లలో సహకారం అందించడం జరుగుతుంది. దీనివల్ల స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు, నాణ్యత లేని నీటిని విక్రయించే అక్రమ బ్రాండ్‌లపై కూడా నియంత్రణ వస్తుందని కంపెనీ భావిస్తోంది.

రిలయన్స్ రాకతో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లోని బిస్లరీ, కోకా-కోలాకు చెందిన కిన్లే, పెప్సికోకు చెందిన ఆక్వాఫినా వంటి దిగ్గజ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్యాకేజ్డ్ వాటర్‌పై విధించే జీఎస్టీని 18% నుంచి 5% కి తగ్గించడం రిలయన్స్ ఎంట్రీకి సరైన సమయంగా మారింది.

Tags

Next Story